ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్ట్​టైం జాబ్​లు ఫుల్ టైం అయ్యాయి! అయినా గిగ్‌ వర్కర్ల గోడును పట్టించుకోని జగన్‌ సర్కార్‌ - GIG Workers Problems in Andhra - GIG WORKERS PROBLEMS IN ANDHRA

YSRCP Government Did not Help to GIG Workers: ప్రభుత్వ కొలువులు ఇవ్వరు. పరిశ్రమల్ని తీసుకురారు! గత్యంతరం లేక పార్ట్ టైం ఉద్యోగాలుగా ప్రారంభించి, బతుకు బండి నడవడానికి వాటినే ఫుల్ టైంగా మార్చుకుంటున్నారు ఏపీ యువత. డెలివరీ బాయ్, బైక్‌ రైడర్‌ లాంటి పనులు చేస్తూ 'గిగ్‌' కార్మికులుగా మారుతున్నారు. ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన జగన్‌ కనీసం వారికి అండగానైనా నిలవలేదు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 7:12 AM IST

YSRCP Government Did not Help to GIG Workers :సంక్షేమం అంటూ నిరంతర భజన చేసే వైఎస్సార్సీపీ ప్రభుత్వం యువతకు ఉపాధి చూపలేకపోయింది. పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తూ వారికి తీరని ద్రోహం చేసింది. దీంతో యువత తమ ఆర్థిక కష్టాల్ని అధిగమించడానికి డెలివరీ బాయ్, బైక్‌ రైడర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో తదితర సంస్థల్లో గిగ్‌ కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ రంగంపై ఆధారపడే వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నా.. వారి సంక్షేమానికి ఎలాంటి చర్యల్లేవు. సెలవులు, ఈపీఎఫ్‌ వంటి సామాజిక భద్రత అందడం లేదు. వారికి జరగరానిది జరిగితే కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమవుతోంది.

'అమ్మా పని చేస్తూనే చదువుకుంటా, కుటుంబానికి తోడుంటా'నంటూ ర్యాపిడో డ్రైవ్‌ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్న యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఓ వైసీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇలాంటి సంఘటనలెన్నో ఉన్నాయి. విద్యార్థులు, యువతే కాకుండా మధ్య వయస్కులూ ఆదాయం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ రంగంపైన ఆధారపడుతున్నవారి సంఖ్య పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్, తెలంగాణ ప్రభుత్వాలు వారికి సంక్షేమ పథకాలు ప్రకటించాయి.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పని చేస్తున్న 4.2 లక్షల మంది గిగ్‌ వర్కర్లకు 5 లక్షల రూపాయల మేర జీవిత బీమాతో పాటు 10లక్షల రూపాయల ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో పనిచేసే వారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో మహిళలూ ఉన్నారు. అయినా జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా వీరి సంక్షేమం గురించి ఆలోచించలేదు.

2030 నాటికి 2.35 కోట్ల తాత్కాలిక కార్మికులు.. సామాజిక భద్రతపై మరిన్ని చర్యలు

గిగ్‌ రంగం వైపు అడుగులు :రాష్ట్రంలో యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన ఉద్యోగాలు లభించడం లేదు. ఐదేళ్లుగా కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమల్లో కొన్ని రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఐటీ కంపెనీల ఊసే లేదు. యువతకు నైపుణ్య శిక్షణ కూడా అందని దుస్థితి. దీంతో అధికశాతం యువత ఉపాధి కోసం రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లడం ఇష్టంలేక రాష్ట్రంలోనే మెరుగైన ఉపాధి కోసం చూసేవారు. తాత్కాలికంగా గిగ్‌ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు కొన్ని కోర్సుల్లో శిక్షణకు అవసరమయ్యే సొమ్ము కోసం గిగ్‌ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు.

పోలీసుల నుంచి సమస్యలు :నచ్చిన సమయంలో పని చేసుకునే వెసులుబాటు ఉండటమే గిగ్‌ ఉద్యోగాల ప్రత్యేకత. కానీ వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కష్టపడితేగానీ 500నుంచి 800 వరకు రాదు. కొన్నిసార్లు రాత్రి సమయాల్లో విధులు, పోలీసుల నుంచి సమస్యలు తదితర ఇక్కట్లూ ఉన్నాయి. ఒకప్పుడు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమైన వీరి సేవలు ఇప్పుడు గ్రామాలకూ విస్తరిస్తున్నాయి. విజయవాడలో కళాశాలల్లో చదివే వందలాది మంది విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఈ రంగంలోనే పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లభించక కొందరు పట్టణాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు అందించి తిరిగి వెళ్తున్నారు. ఎండలు, వానల్లోనూ గిగ్‌ కార్మికులు కాలంతో పోటీపడుతూ ఆర్డర్లను తీసుకెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది.

2 కోట్ల 35 లక్షలకు చేరుతుంది :గిగ్‌ వర్కర్లుగా పనిచేసే వారిలో అధికశాతం మధ్యస్థ నైపుణ్యం కలిగి ఉన్నట్లు నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడిస్తోంది. 2020-21లో దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్లు 77లక్షల మంది ఉండగా వీరిలో 47 శాతం మధ్యస్థ నైపుణ్యం, 2 శాతం మంది అధిక నైపుణ్యం, 33 శాతం మందికి తక్కువ నైపుణ్యం ఉంది. ఈ విభాగంలోని వారి సంఖ్య గత కొంతకాలంగా పెరుగుతోంది. 2029-30 నాటికి సుమారు 2 కోట్ల 35 లక్షలకు చేరుతుందని అంచనా. గిగ్‌ ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యం, ఫిన్‌టెక్, ఈ కామర్స్‌ రంగాలు అగ్రభాగంలో ఉన్నాయి.

'గిగ్'​తో ఉపాధి రంగంలో కొత్త శకం

ఇతర రాష్ట్రాల్లో వీరి సంక్షేమానికి చర్యలు : బైక్, మొబైల్‌ ఉంటే ఎవరైనా ఈ పనిచేసుకునే అవకాశం ఉంది. దాంతో చాలామంది ఇటువైపు వస్తున్నారు. అయితే, దీన్లో ఏడాదంతా పని చేసినా అధికారిక సెలవులేవీ వర్తించవు. పనిచేసిన సమయానికే ఆదాయం వస్తుంది. భవిష్యనిధి, ఆర్జిత సెలవులు వంటి సౌకర్యాలేవీ ఉండవు. అంటే ఏడాది పొడవునా చాకిరీ చేయాల్సిందే. వీరి సామాజిక భద్రతపై కేంద్రం ఇటీవల దృష్టి పెట్టింది. సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత సంస్థలకు సూచించింది.

గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి రాజస్థాన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించి శాసనసభలో బిల్లు ఆమోదించారు. నిధిని ఏర్పాటు చేస్తున్నారు. గిగ్‌ వర్కర్లను నమోదు చేయడంతోపాటు, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి తగిన పరిష్కారం చూపిస్తారు. చట్ట నియమాలను ఉల్లంఘించే సంస్థలకు 50లక్షల వరకు జరిమానాలనూ ప్రతిపాదించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీరి సంక్షేమానికి చర్యలు చేపట్టింది. మన రాష్ట్రంలో గిగ్‌ వర్కర్లకు సంబంధించి ప్రత్యేక పథకాలు ఏమీ లేవు. సంక్షేమం అంటూ నిరంతర భజన తప్పితే ఇలాంటి వారి ప్రయోజనాల్ని పట్టించుకున్న దాఖలాలే లేవు.

నైపుణ్యం పెట్టుబడిగా పెట్టు.. ఆన్​లైన్​లోనే ఉపాధి పట్టు

గిగ్‌ వర్కర్ల గోడు పట్టించుకోని జగన్‌ సర్కార్‌ - ఇతర రాష్ట్రాల్లో వీరి సంక్షేమానికి చర్యలు

ABOUT THE AUTHOR

...view details