YSRCP Govt SECI Deal : అదానీ విద్యుత్ కొనడం కోసం వైఎస్సార్సీపీ సర్కార్ ముందస్తు కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం కన్నా ఎక్కడో సుదూరంలో ఉన్న రాజస్థాన్‌లోని ప్రాజెక్టుల నుంచి కరెంట్ కొనుక్కోవడమే లాభమంటూ నాటి పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ అసంబద్ధ నివేదిక ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్‌లోని అదానీ ప్రాజెక్టుల నుంచి 7,000ల మెగావాట్ల విద్యుత్ కొనేందుకు సెకితో ఒప్పందం కుదుర్చుకోవాలని జగన్ సర్కార్ ముందే నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నాటి ఆర్థిక, విద్యుత్ శాఖల అభ్యంతరాల్ని తోసిపుచ్చేందుకు కంటితుడుపుగా ఓ కమిటీని నియమించింది. ఏటా 1700 కోట్ల యూనిట్ల విద్యుత్ కొంటే, ఒక్కో యూనిట్‌కి సెకి కరెంట్‌కి ఎంత ఛార్జీ పడుతుందో, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సరఫరా చేసే కరెంట్‌కు ఎంత ఛార్జీ పడుతుందో కమిటీ లెక్కలు వేసింది. ఆ లెక్కల్లో నిష్పాక్షికతకు పాతరేసి జగన్ మనసెరిగి నివేదిక ఇచ్చింది.
సెకి నుంచి కరెంట్ తీసుకుంటే అంతరాష్ట్ర సరఫరా నష్టాలను 3 శాతం అదనంగా భరించాల్సి వచ్చినా ఏటా రూ.2050 కోట్ల చొప్పున పాతికేళ్లలో రూ.51,250 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందంటూ వాస్తవాలకు కమిటీ పాతరేసింది. ఏపీజీఈసీఎల్‌తో ఒప్పందం చేసుకుంటే యూనిట్ ధర రూ.2.49తోపాటు అంతరాష్ట్ర సరఫరా ఛార్జీల కింద యూనిట్‌కు 99 పైసలు అదనంగా ఖర్చు చేయాలని పేర్కొంది. తద్వారా యూనిట్ ధర రూ.3.48కి చేరుతుందని కమిటీ తెలిపింది.
Adani Bribery Case Updates :ఈ లెక్కన విద్యుత్ కొనుగోలుకు ఏటా రూ.5916 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రూ.1,47,900 కోట్లు ఖర్చవుతుందని కమిటీ దొంగ లెక్కలు కట్టింది. ప్రాజెక్టులు ప్రతిపాదించిన జిల్లాల నుంచి విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించేందుకు నెట్‌వర్క్ విస్తరించాలని దానికి మరో రూ.2600 కోట్లు ఖర్చు చేయాలని పేర్కొంది. ఆ రూ.2600 కోట్లు కలిపినా పాతికేళ్లలో ఏపీజీఈసీఎల్ నుంచి కరెంట్ కొనేందుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.1,50,500కోట్లే.
అంటే ఏటా సగటున రూ.6020 కోట్లు ఖర్చవుతుంది. కానీ ఆ కమిటీ ఏటా రూ.6400 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. అంటే ఏటా రూ.380 కోట్ల చొప్పున పాతికేళ్లలో రూ.9500ల కోట్లు అదనపు ఖర్చును చూపించింది. అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలను కమిటీ యూనిట్‌కి 99 పైసలుగా లెక్కించడంలోనే పెద్ద తిరకాసు ఉంది. ఏపీజీఈసీఎల్ ద్వారా 10,000ల మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే, దాన్ని కేంద్ర గ్రిడ్‌కు అనుసంధానించేందుకు ప్రొరేటా ప్రకారం అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలకు ఏటా రూ.1675 కోట్లు ఖర్చవుతుందని చెప్పింది. దాన్ని బట్టి యూనిట్‌కు 99 పైసలుగా లెక్కతేల్చింది.