YSRCP Cookers Distribution in Vijayawada: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తాయిలాలను ఎరవేసిన వైఎస్సీర్సీపీ, ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైంది. కుక్కర్ల పంపిణీకి పార్టీ గుర్తుతో కూపన్లు ముద్రిస్తూ, సీ విజిల్ యాప్‌నకు అందిన ఫిర్యాదుతో దొరికిపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్‌సింగ్ నగర్‌లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్‌లో భారీగా కుక్కర్లు ప్యాకింగ్ చేసి ఉన్నాయని ఆదివారం మధ్యాహ్నం సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు వచ్చింది.
ఫ్లైయింగ్ స్క్వాడ్-9 అధికారి డి.రవిచంద్ర సూర్యకుమార్ సిబ్బందితో వెళ్లి లక్కీ ప్రింటర్స్‌లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా వస్తువులు కనిపించలేదు. కానీ ప్రెషర్ కుక్కర్, ఫ్యాన్ గుర్తున్న షీట్లు 5 వేల 250 దొరికాయి. ఒక్కో షీట్‌లో 24 కూపన్లు ఉన్నాయి. దీనిపై ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి రవిచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.
కుక్కర్లు ఎక్కడ:పోలీసులు తనిఖీ చేయగా మొత్తం లక్షా 26 వేల కూపన్లు దొరికాయి. కుక్కర్లు దొరక్కపోవడంతో వాటిని రహస్య ప్రదేశంలో దాచారా లేదంటే దుకాణాల గోదాముల్లో నిల్వ చేశారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఓటర్లు ఈ కూపన్లను పట్టుకెళ్లి కుక్కర్లు తెచ్చుకునేలా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వాలంటీర్లకు వైఎస్సీర్సీపీ నాయకులు ఒక్కోటి 800 రూపాయల విలువ చేసే కుక్కర్లు పంచారు. తాజా కూపన్లలోనూ అలాంటి చిత్రాలే ముద్రించారు. ఈ లెక్కన లక్ష 26 వేల కుక్కర్ల వ్యయం సుమారు 10 కోట్ల రూపాయలపైనే ఉంటుంది. అంతమొత్తంలో వస్తువులను దుకాణాల్లో ఉంచడం అసాధ్యమని, అవి ఎక్కడ దాచారో తెలియాల్సి ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.