YS Sunitha on Kadapa Court Order About Viveka Murder Case :పులివెందులలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా వైఎస్సార్సీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య అంశంపై ఎవరూ మాట్లాడకూడదు అంటూ కడప కోర్టులో వచ్చిన ఉత్తర్వులను ఆమె తప్పు పట్టారు. ప్రతివాదులుగా పేర్కొంటున్న వారి వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం పైన ఆమె అభ్యంతర వ్యక్తం చేశారు. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని, న్యాయ పోరాటం కొనసాగిస్తానని సునీత స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో తాను ప్రజల వద్దకు వెళుతుంటే అధికార పార్టీ నాయకుల్లో వణుకు మొదలై తనను కోర్టులు చుట్టూ తిరిగే విధంగా కేసులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా వివేకా అంశంపైన చాలా సందర్భాల్లో మాట్లాడిన కోర్టు ఉత్తర్వుల్లో అలాంటి ప్రస్తావన లేకపోవడంపైన ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలందరూ తన కోరికను మన్నించాలని ప్రజల వద్దకు రాలేకపోతున్నందుకు క్షమించాలని కోరారు. ఈ ఎన్నికల్లో న్యాయం గెలవాలంటే తప్పకుండా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను గెలిపించాల్సిన బాధ్యత కడప పార్లమెంటు పరిధిలోని ప్రజలు అందరిపైనా ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు.