YS Sunitha Complaint to Cyberabad Police : తనకు ప్రాణహాని ఉందని వైఎస్ సునీత ఫిర్యాదు చేశారని సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఇటీవలి కొంత కాలం నుంచి కొందరు వ్యక్తులు ఫేస్బుక్లో చంపుతామంటూ పోస్టులు పెడుతున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారని డీసీపీ తెలిపారు. చంపేస్తామని అర్థం వచ్చే విధంగా ఆ పోస్టులు ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేశారని డీసీపీ తెలిపారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువవుతున్నాయని, చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత ఫిర్యాదులో కోరినట్లు శిల్పవల్లి వివరించారు.
కాగా ఇటీవల వైఎస్ సునీత (YS Sunitha) ఇడుపులపాయలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో (YS Sharmila) భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సునీత కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ సునీతను చంపేస్తామంటూ బెదిరించడం, ఆమె ఫిర్యాదు చేయడంతో మరోసారి ఆమె రాజకీయ ప్రవేశం గురించి చర్చకు దారితీసింది.
ఇప్పటికే సునీత తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) నిందితులుగా ఉన్నారు. వైఎస్ భాస్కరరెడ్డితో పాటు మరికొంతమంది జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు.
వైఎస్ షర్మిలతో వివేకా కుమార్తె సునీత భేటీ - కాంగ్రెస్‌లో చేరనున్నారా?