YS JAGAN MOHAN REDDY NCLT CASE: సరస్వతి పవర్‌లో షేర్ల బదిలీకి సంబంధించి హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ NCLTలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది ఎన్సీఎల్టీ ఎదుట హాజరై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరగా, వచ్చే నెల 13వ తేదీకి విచారణ వాయిదా వేశారు.
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో తన పేరు మీద, భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ.. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, జనార్దన్ రెడ్డిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ కేసు వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో జగన్‌కు 74 లక్షల 26 వేల 294 షేర్లు, భారతికి 40 లక్షల 50 వేలు, క్లాసిక్ రియాల్టీ సంస్థకు 12 లక్షల షేర్లు ఉన్నట్లు పిటిషన్‌లో వెల్లడించారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీకి మొత్తం 51.01 శాతం వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. సోదరిపై ప్రేమాభిమానంతో సరస్వతీ పవర్ కంపెనీలో జగన్, భారతి, వారి కంపెనీల పేరిట ఉన్న షేర్లను భవిష్యత్తులో బదిలీ చేస్తామని, 2019 ఆగస్టు 31వ తేదీన అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
వైఎస్ కుటుంబంలో వాటాల రచ్చ - తల్లి, చెల్లిని కోర్టుకీడ్చిన జగన్
షేర్ల బదిలీ ఫారాలు సమర్పించకుండానే : ఆ తర్వాత సరస్వతీ పవర్‌లో జగన్‌కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు, భారతి డైరెక్టర్‌గా ఉన్న క్లాసిక్ రియాల్టీకి చెందిన వాటాలు కలిపి మొత్తం కోటి 21 లక్షలకు పైగా షేర్లను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేసినట్లు తెలిపారు. షర్మిల తరఫున విజయమ్మ తన పేరు మీద షేర్లు బదిలీ చేయించుకున్నట్లు, ఈడీ, సీబీఐ కేసులు, కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగతావి బదిలీ చేయాలకున్నట్లు తెలిపారు.