Youth Fire on YSRCP Govt: ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించి గద్దెనెక్కిన జగన్ నిరుద్యోగులను నిండా ముంచారు. ఎన్నికల వేళ DSC, గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు అంటూ హడావుడి చేశారే కానీ నిరుద్యోగుల సంఖ్యకు తగ్గ పోస్టులు విడుదల చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయినా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా స్థిరపడదామనుకున్న యువత ఆశలపైనా పాలకులు నీళ్లు చల్లారు. ఏపీకి పెట్టుబడులు రాక పక్క రాష్ట్రాలకు యువత వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ విధానాలపై యువత ఆగ్రహం
'వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తానని పాదయాత్రలో హామీలు కురిపించిన జగన్ నిరుద్యోగ సమస్యలను గాలికొదిలేశారు. నాలుగేళ్లు కాలయాపన చేసి ఎన్నికలు దగ్గర పడటంతో నామ మాత్రపు పోస్టులతో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు కానిచ్చేశారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి అటు పాఠశాల విద్యను ఇటు ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలను ఉద్ధరిస్తామని జగన్ హామీలు గుప్పించారు. కానీ సీఎం పీఠం ఎక్కాక ఆ విషయాన్నే మర్చిపోయారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది నిరుద్యోగులు DSC కోసం వేచిచూస్తుంటే కేవలం 6వేల 100 పోస్టులు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడంపై నిరుద్యోగుల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగసిపడినా ప్రభుత్వం పట్టించుకోలేదు.' -నిరుద్యోగులు