Young Man Committed Suicide :ప్రేమ వ్యవహారంలో ఓ నిండు ప్రాణం బలైంది.నిమ్నజాతికి చెందిన ఓ యువకుడు ఉన్నత కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. అతడిపై కులం పేరుతో దాడికి పాల్పడటంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కాకి చిన్న అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మబండ మహంకాళి నగర్లో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు కాకి సునీల్(23), ఎంఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సునీల్, ఓ యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు.
ఆ యువతి ఉన్నత కులానికి చెందినది కావటంతో ఆమె సోదరులు పలు మార్లు సునీల్‌పై దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. సోమవారం రాత్రి సునీల్ తన సోదరుడితో కలిసి నిజాంపేటలోని ఓ వైన్‌షాప్‌నకు వెళ్లగా, అక్కడ యువతి సోదరుడు, అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. అదే రోజు రాత్రి యువతి కుటుంబసభ్యులు, సోదరుడు అతని స్నేహితులు సునీల్ ఇంటి పైకి దాడికి దిగారు.