YCP Leaders Frauds in Kurnool District Cooperative Central Bank : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు ‘సహకారం’ అనే మాటే కొరవడింది. బ్యాంకులో పెత్తనం చేసి అయినవారికి అప్పనంగా రుణాలిచ్చారు. వసూళ్లలో చేతులెత్తేయడంతో బ్యాంకు నష్టాలబాటలో పయనించింది. బ్యాంకు నిరర్ధక ఆస్తులు కొండలా పెరిగిపోయి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో కర్నూలు జిల్లా సహకార బ్యాంకు వరుసగా రాయలసీమలోనే ఉత్తమ బ్యాంకుగా ఎంపికై అవార్డులను సొంతం చేసుకుంది. 2023-24లో ఆ పరిస్థితి కానరావడం లేదు.
సహకార సంఘాల్లో జేబు దొంగలు పడ్డారు: అచ్చెన్నాయుడు - revival of cooperative societies
కక్ష గట్టి సీఈవోకు పొగ :ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 మండలాల పరిధిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు విస్తరించింది. ఏటా రూ. 3 నుంచి 4 వేల కోట్ల టర్నోవర్‌తో లాభాల్లో ఉన్న బ్యాంకు గత వైసీపీ పాలకుల స్వార్థ నిర్ణయాలతో నష్టాల ఊబిలో చిక్కుకుంది. 2022-23లో రూ.11 కోట్ల వరకు ఆదాయం గడించింది. అందులో రూ.5 కోట్లను డివిడెంట్లుగా 99 ప్రాథమిక సహకార సంఘాలకు ఇచ్చారు. 2023-24లో రూ.1.68 కోట్ల లాభాలే వచ్చాయి. రైతులకు కాకుండా జేఎల్‌జీ గ్రూపులకు రుణాలివ్వడాన్ని అడ్డుకున్న అప్పటి సీఈవోకు గత పాలకులు పొగపెట్టారు. దీంతో ఆయన 2023-24 జనవరిలో రాజీనామా చేశారు. 2025 వరకు కొనసాగాల్సిన ఆయన్ను ముందే సాగనంపారు. సీఈవోను తప్పించాలంటే ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చర్యలు తీసుకోవాలి. లేదా ముందస్తుగా ఆర్‌బీఐ, నాబార్డు అనుమతి తీసుకోవాలి. ఇవేవీ పట్టించుకోకుండా వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పించారు. ఫలితంగా బ్యాంకు కార్యకలాపాలను పర్యవేక్షించేవారు కరవయ్యారు. వైఎస్సార్సీపీ నేతలకు అడ్డగోలుగా ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేయలేకపోయారు.