YCP Activist Tried to Attack TDP Leader Somireddy: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు ప్రచారానికి రానివ్వమంటూ హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ' ప్రచారంలో భాగంగా తమ గ్రామానికి వస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టారు. వాటిని వైసీపీ కార్యకర్తలు బల్లి వెంకటయ్య, సాయి, అంకయ్య, అయ్యప్ప చించేశారు. ఫ్లెక్సీ కర్రలను చెరువులో పడేశారు.
అయితే ఇది గమనించిన టీడీపీ శ్రేణులు సోమవారం మళ్లీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వెంకటయ్య మరోసారి వాటిని చించివేయడంతో పాటు టీడీపీ నాయకులను, శ్రేణులను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా సోమిరెడ్డి ప్రచారానికి వచ్చిన సమయంలో ఆయనను స్వాగతిస్తూ టపాకాయలు కాలుస్తున్న టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి సైతం దిగాడు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు వెంకటయ్యని అడ్డుకున్నారు.
దీంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య కాసేపటికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ శ్రేణులపైకి గునపంతో దూసుకొచ్చి, పొడిచేస్తానంటూ బెదిరించాడు. దీంతో వెంటనే టీడీపీ శ్రేణులు అతడిని అడ్డుకొని, సోమిరెడ్డిని ఇతర టీడీపీ నాయకులను అక్కడ నుంచి దూరంగా తీసుకుపోయారు.
టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారని అడిగినందుకు వైఎస్సార్సీపీ నేతల దాడి
సోమిరెడ్డి కట్టువపల్లి నుంచి వెళ్లిపోయాక వైసీపీ నాయకులు టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి ఆయనపై దాడికి పాల్పడ్డారు. కారు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. స్థానిక మహిళలు అడ్డుకోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు,కార్యకర్తలు వెంకటయ్య ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. వెంకటయ్యపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు దాడికి యత్నించిన వైసీపీ కార్యకర్తపై మనుబోలు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సోమిరెడ్డిపై దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. అయిదేళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల తప్పుడు కేసులు, కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు చూశామని, తొలిసారి భౌతిక దాడులకు తెగబడ్డారని సోమిరెడ్డి విమర్శించారు. తాము గుడిలో దండం పెట్టుకొని బయటకు వచ్చేసరికి గునపంతో తమపైకి దూసుకొచ్చాడని సోమిరెడ్డి తెలిపారు.
TDP Atchannaidu Condemned: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై దాడికి యత్నించడపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యక్రమం వద్ద వైసీపీ శ్రేణులు కర్రలు, రాడ్లతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లని మండిపడ్డారు. దాడులు చేసే వారిని, హత్యలు చేసే వారిని జగన్ రెడ్డి ప్రోత్సహించడం వల్లనే వైసీపీ శ్రేణులు పెచ్చుమీరిపోతున్నారని ధ్వజమెత్తారు.
కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు - దారికాచి మరీ టీడీపీ నేతపై దాడి