Water soaked grain in Procurement centers :అకాల వర్షంతో కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో ఆడ్లూర్, టేక్రియాల్, లింగాపూర్, దోమకొండ మండలంలోని సంగమేశ్వర్, బిక్కనూర్ మండలంలోని వరి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా నీటి మునిగింది. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట వర్షార్పణం అవుతుంటే అన్నదాత దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు :వరి పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు గడిచినప్పటికీ సరైన సమయంలో రైతుల నుంచి సేకరించి కాంటా చేయకపోవడం వల్లనే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు, లారీల కొరత ఉందని తెలిపారు. మరోవైపు ఉదయం పూట ఎండ కొడుతూ సాయంత్రం నాలుగు గంటలు కాగానే వారం రోజులుగా వానలు పడుతున్నాయి.
వర్షం ధాటికి వడ్లు పూర్తిగా తడిచి మొలకలొస్తున్నాయి. ఫలితంగా చేసిన కష్టం నీటిపాలవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న పలు మండలాలతో పాటు గ్రామాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం నీటమునిగింది. వరి కొనుగోలు కేంద్రాలు చెరువుల్లా మారిపోయాయి. దీంతో అన్నదాతలు వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. వరి ధాన్యం కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.