World Telugu Writers Conference On 2nd Day : విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మాతృభాషా పరిరక్షణ ఆవశ్యకతను ఘనంగా చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రచయితలు తెలుగు భాషకు పూర్వవైభవం రావాలంటూ తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. మహాసభల్లో భాగంగా తొలుత పరిశోధనరంగ ప్రతినిధులు, తర్వాత భాషోద్యమ ప్రతినిధులు హాజరై తమ మనోభిష్టాన్ని వెల్లడించారు. ప్రస్తుతం భాషా పరిశోధన స్థాయి దిగజారిందని, డబ్బులతో డాక్టరేట్లు కొనే స్థాయి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాడని భాష వాడిపోతుందని, వాడిన భాష వికసిస్తుందని భాషోద్యమ ప్రతినిధులు పేర్కొన్నారు.
విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో రెండోరోజూ సాహితీ ప్రేమికులు సందడి చేశారు. వివిధ రచనా వ్యాసాంగాలతో సభలను రక్తి కట్టించారు. కొందరు కవితలు వినిపిస్తే, మరికొందరు సాహీతీ ఉపన్యాసాలు చేశారు. పరిశోధనరంగ ప్రతినిధుల సదస్సుకు విశ్రాంత చరిత్ర ఉపన్యాసకులు సవరం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రధానంగా పరిశోధనరంగంపై జరిగిన సదస్సు వాడివేడిగా సాగింది. డబ్బులుంటే డాక్టరేట్లు వచ్చే పరిస్థితులు వచ్చాయని, భాషా పరిశోధన స్థాయి దిగజారిందని వక్తలు అభిప్రాయపడ్డారు.
'భాషను బతికించడంలో మీడియా పాత్ర ఎంతో ఉంది - తెలుగు భాష మన అస్తిత్వం'
పదో తరగతి తప్పినవాడు సైతం డాక్టరేట్ చేశానని చెబుతున్నాడని, వీటిపై ప్రభుత్వం నిషేధం విధించాలని దుగ్గిరాలకు చెందిన మన్నవ సత్యనారాయణ వంటివారు డిమాండ్ చేశారు. భాషా పరిశోధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పరిశోధనలో శోధన మాత్రమే మిగిలిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యం బతకాలని, మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని రచయితలు నొక్కిచెప్పారు. దిల్లీకి చెందిన ప్రబల జానకీదేవి మాట్లాడుతూ, ఓ పుస్తకాన్ని చదవగానే సంతృప్తి రావాలని, విలువలు లేని అక్షరాలను రాయవద్దని యువ రచయితలకు ఆమె పిలుపునిచ్చారు. రచనల్లో, కథల్లో ఆత్మహత్యలు వంటి నెగెటివ్ టచ్ ఉన్న అంశాలను ప్రస్తావించరాదని చెప్పారు.