World Telugu Writers Conference For Second Day In Vijayawada : పిల్లల మనోవికాసానికి తోడ్పడేలా కనీసం ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే బోధన జరగాలని, తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానించింది. విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో రెండురోజుల పాటు నిర్వహించిన మహాసభల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు సదస్సుల్లో వక్తలు తెలుగు భాషా వికాసానికి చేసిన సూచనలను తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూర్ణచందు 18 తీర్మానాలను సభ ముందు ఉంచగా, సభికులు కరతాళధ్వనులతో ఆమోదించారు. ఈ తీర్మానాలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు అందజేశారు. తీర్మానాల్లోని ముఖ్యాంశాలు.
- బాలల మనోవికాసానికి తోడ్పడేలా కనీసం ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే బోధన జరగాలి.
- తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలి.
- వృత్తులు, జీవన విధానాల్లో కనుమరుగైపోతున్న తెలుగు పదాలను వెలికితీసి, ప్రాచుర్యం కల్పించాలి. తెలుగు భాషాభిమానాన్ని కలిగించే రచనలను ప్రోత్సహించాలి.
- ఆంగ్ల పదాలకు సమానమైన, సహజమైన తెలుగు పదాలు సృష్టించాలి.
- ఇంటా, బయటా, సామాజిక జీవన వ్యవహారాల్లో తెలుగు వినియోగాన్ని పెంచాలి.
- డిగ్రీ స్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాలి.
- ఇంజినీరింగ్, మెడిసిన్, తదితర కోర్సులను కూడా మాతృభాషలోనే బోధించాలనే కేంద్ర ప్రభుత్వ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేసేందుకు జారీ చేసిన జీవో 85పై వైఎస్సార్సీపీ హయాంలో సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి.
- హైకోర్టులో మాతృభాషలోనే వాద ప్రతివాదనలు, తీర్పులు ఉండాలి. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు స్పందించాలి.
- చట్టాలను తెలుగులోకి అనువదించడంతో పాటు పారిభాషిక పదకోశాలను తయారు చేయించాలి.
- గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్ఠపరిచి నిధులు కేటాయించాలి.
- పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి.
- తెలుగు అకాడమీని ‘తెలుగు- సంస్కృత అకాడమీ’గా మార్చడం వల్ల ప్రాథమిక లక్ష్యం దెబ్బతింది. తెలుగు అకాడమీ పూర్వ వైభవానికి కృషి చేయాలి.
- ఎన్టీఆర్ హయాంలో నెలకొల్పిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విభజన సందర్భంగా షెడ్యూల్ 10 జాబితాలో చేర్చారు. దీని విభజన ఇంకా అపరిష్కృతంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
- సమగ్ర లక్ష్యాలు, నిధులతో వివిధ అకాడమీలను పటిష్ఠపరచాలి. కళల పరిరక్షణ, పరిశోధన, పరివ్యాప్తికి సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.
- రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో స్టేట్ లైబ్రరీ, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, స్టేట్ ఆర్కైవ్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలి.
- తెలుగు కళారూపాలను, దృశ్య కళలను కాపాడేందుకు భాషా విధానాన్ని, సాంస్కృతిక విధానాన్ని రూపొందించి రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాలి.
"ప్రజల భాషలోనే న్యాయపాలన జరగాలి"- మహాసభల వేదికగా పిలుపునిచ్చిన న్యాయమూర్తులు