World Bank Rs 15,000 Crore Loan to Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కిరాబోతోంది. రాజధాని అమరావతికి రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది.
రూ.49వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా : ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం రూ.15వేల కోట్లూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సీఆర్‌డీఏ (CRDA)కి అందనున్నాయి. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌ల అభివృద్ధి, పరిపాలన నగరంలో శాసన సభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు రూ.49వేల కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ తాజాగా అంచనా వేసింది. రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండడంతో దానికి అనుగుణంగా సీఆర్‌డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రాజధానిలో ముగిసిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందం పర్యటన - అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం!
నవంబరులో నిధులు - డిసెంబరు నుంచి పనులు మొదలు! :ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులు అన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం 3,4 దఫాలు రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంకు, సీఆర్‌డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగనుంది. నవంబరు 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తైతే రూ.15 వేల కోట్లు మంజూరైనట్టే! ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే రూ.3,750 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. నవంబరులో ఆ నిధులు వస్తే డిసెంబరు నుంచి పనులు మొదలు పెట్టాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది.
3 నెలల్లోనే ప్రక్రియలన్నీ పూర్తి : ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ రుణ వితరణ సంస్థలు ఒక ప్రాజెక్టుకు ఇంత వేగంగా రుణం మంజూరు చేయడం రికార్డు! ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు నిర్దిష్ట ప్రాజెక్టులకు రుణాలు ఇస్తాయి. ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణం, సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ సంతృప్తికరంగా ఉందా? వంటి అంశాలు అన్నీ కూలంకషంగా అధ్యయనం చేశాకే రుణం ఇస్తాయి. సంప్రదింపులకే సంవత్సరం పడుతుంది.