ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమ్మాయిలు అలర్ట్ - సోషల్ మీడియాలో జాగ్రత్త - మాయగాళ్ల వలకు చిక్కితే అంతే! - Beware of social Media Friendships

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 11:49 AM IST

Beware of Friendships on Social Media : ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. చిన్న కుటుంబాల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. దీంతో పిల్లలతో మాట్లాడే తీరిక తల్లిదండ్రులు లేకుండా పోయింది. దీంతో వారు ఒంటరితనానికి లోనవుతున్నారు. ఆ ఒంటరితనాన్ని పొగొట్టుకునేందుకు సెల్​ఫోన్​ ద్వారా సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఆ పరిచయాలే ఇప్పుడు అనర్థాలకు దారి తీస్తుండటం కలకలం రేపుతోంది.

Beware of Friendships on social Media
Beware of Friendships on social Media (ETV Bharat)

Alert on Social Media Friendships :నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్​ఫోన్ సర్వసాధారణమైంది. సమయం దొరికితే చాలు ఆన్​లైన్​లో ఉండాల్సిందే. ఇక ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్​, వాట్సాప్​ లాంటి సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. హద్దులు దాటనంతవరకు అవి బాగానే ఉన్నా, కొన్ని సార్లు ఆ పరిచయాలే కొంపముంచుతున్నాయి. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి నయవంచనకు పాల్పడుతున్నారు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.

Women Missing Cases in AP : ఏపీలో ఇలాంటి ఘటనలు కలవరపెడుతున్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థినులు అప్పటి వరకు తల్లిదండ్రుల చాటుబిడ్డలుగా ఉంటుంటారు. కానీ ఒక్కసారిగా అపరిచిత వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు, ప్రేమ వ్యవహారాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తెలియని వారితో తమ పిల్లలు వెళ్లడం వారు ఏమైపోతున్నారోనన్న ఆందోళన పేరెంట్స్​లో నెలకొంటోంది. దీంతో వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం : ఇలాంటి ఘటనలపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు కానిస్టేబుల్‌ను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పంపుతున్నారు. ఇలా వారికి వెతకడానికి ఒక్కోసారి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ పక్క పిల్లలు ఏమయ్యారోనన్న వేదన, మరో పక్క వెతకడానికి ఆర్థిక భారం. ఇంకోవైపు పరువు పోయిందన్న బాధ. ఇలా తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. చదువుకునే సమయంలో ప్రేమ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లి వారి భవిష్యత్​ను నాశనం చేసుకుంటున్నారు.

విద్యార్థినులు, యువతులు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న అదృశ్య కేసుల్లో ఎక్కువగా ప్రేమ వ్యవహారాలే ఉంటున్నట్లు పోలీసులు అంటున్నారు. మైనార్టీ తీరిన వారు తల్లిదండ్రులను ఎదిరించే స్థాయికి చేరుతున్నారని చెబుతున్నారు. మరోవైపు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినా తాము మేజర్లమని చెబుతూ, తిరిగి రాని పరిస్థితులు నెలకొంటున్నాయని వారు అంటున్నారు.

రాష్ట్రంలో జరిగిన ఘటనలు :

  • ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వద్దకు ఓ బాధితురాలు వచ్చింది. తన 16 ఏళ్ల కుమార్తెను ఓ యువకుడు తీసుకెళ్లి తొమ్మిది నెలలు అయిందని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం స్పందించి. దీనిపై వెంటనే పవన్‌ స్పందించారు. పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు తొమ్మిది రోజుల్లో కశ్మీర్‌లో ఉన్న బాలిక ఆచూకీని కనుగొని తల్లికి అప్పగించారు. పోలీసులు దృష్టిపెడితే మిస్సింగ్ కేసులను ఛేదించడంలో చురుగ్గా వ్యవహరిస్తారని ఈ ఉదంతం తేటతెల్లం చేసింది.
  • వైఎస్సార్సీపీ హయాంలో మహిళా అదృశ్యం కేసులు పెరిగిపోతున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీటిని అరికట్టాలని ఆయన గతంలో చాలా సార్లు ప్రస్తావించారు. దీనిపై కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వీటిపై దృష్టి సారించింది. మిస్సింగ్ కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖ అధికారులకు హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.
  • ఇటీవల అనకాపల్లికి చెందిన యువతిని కొంతమంది యువకులు కిడ్నాప్‌ చేశారు. వారిలో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. బాధిత తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి విచారిస్తుండగా ఆ అమ్మాయి ఇంటికి తిరిగొచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. ఇలా మిస్సింగ్ కేసు కాస్తా అత్యాచారం, కిడ్నాప్‌ కేసుగా మారడం అందరిలోనూ ఆందోళన కలిగించింది.
  • అనకాపల్లికి చెందిన ఓ విద్యార్థిని ఫోన్‌లో పరిచయమైన యువకుడితో ఇతర రాష్ట్రానికి వెళ్లింది. అతడు మాయగాడని తెలుసుకుని తల్లిదండ్రులు, పోలీసుల సాయంతో ఇంటికి తిరిగి వచ్చింది.
  • ఎలమంచిలికి చెందిన వివాహిత అపరిచిత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే కుమారుడితో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త పోలీసులను ఆశ్రయించడంతో వెతగ్గా తిరిగి ఇంటికి చేరుకుంది.
  • మాడుగుల మండలం డి.సురవరానికి చెందిన ఇంటర్‌ విద్యార్థినికి ఇన్‌స్టాగ్రాంలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూలిపని చేసుకుని జీవించే తల్లిదండ్రులు కుమార్తె చేసిన పనికి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మిస్సింగ్ కేసులు కలవరపెడుతున్నాయి. అల్లూరి జిల్లాలో ఈ ఏడాది అదృశ్యమైన కేసులు మొత్తం 39 నమోదయ్యాయి. ఇందులో 24 మంది ఆచూకీ కనుగొన్నారు. ఇలా ఎంతోమంది మాయగాళ్ల వలలో పడుతూ ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఘటనలు జిల్లాలో అధికమవుతున్నాయి. పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే అదృశ్యం కేసుల ఫిర్యాదులు తీసుకోవడానికి కొంతమంది పోలీసులు వెనుకంజ వేస్తున్నారు. ఇటీవల అనకాపల్లిలో నిర్వహించి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం ఈ విషయాన్ని చెప్పడం విశేషం.

ఇలాంటి కేసులపై ప్రత్యేక చొరవ : అనకాపల్లి జిల్లాలో అదృశ్యం కేసులపై ప్రత్యేక దృష్టిసారించి చాలావరకు పరిష్కరించామని అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లోనే ఎక్కువగా మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్‌ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎవరైనా కనిపించకుండాపోతే కేసులను వెంటనే నమోదు చేయడంతో పాటుగా వివరాలు సేకరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చూపొద్దని పోలీస్‌ సిబ్బందికి ఆదేశాలిచ్చామని వెల్లడించారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు వద్దని పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ దీపిక వెల్లడించారు..

పిల్లలను ఎప్పటికప్పుడూ గమనిస్తుండాలి :మరోవైపు చదువుకునే వయసులో ఇలాంటి వ్యవహారాలు తగవని మనస్తత్వశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెబుతున్నారు. వారు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారన్నది పర్యవేక్షించాలని మనస్తత్వశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ చొరవ - విజయవాడ యువతి ఆచూకీ లభ్యం - Vijayawada Police on Girl Missing

బీ అలర్ట్.. ఫోన్​లోని వీడియోలు.. పోర్న్‌ సైట్స్​లో ప్రత్యక్షం!

ABOUT THE AUTHOR

...view details