ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలకు అలర్ట్ - తెలిసినవారే 'తేడా' గా మారుతున్నారు! - SEXTORTION CASES RISE IN AP

మహిళలు, యువతుల వ్యక్తిగత చిత్రాలు, వీడియోల మార్పు - సోషల్ మీడియాలో బెదిరింపులు

Sextortion Cases Rise in AP
Sextortion Cases Rise in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2025, 12:43 PM IST

Sextortion Cases Rise in AP : మహిళలు, యువతులను రకరకాలుగా ట్రాప్‌ చేసి వారి వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు తీసి బెదిరిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి సోమవారం ఫిర్యాదుల విభాగానికి సైతం తరచూ ఫిర్యాదులొస్తున్నాయి. తాజాగా గుంటూరు నగరానికి చెందిన మస్తాన్‌ సాయి బాగోతం సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అత్యధిక సందర్భాల్లో తెలిసినవారి చేతుల్లోనే ఆడవారు బలైపోతుండడం గమనార్హం.

అప్రమత్తంగా లేకపోతే :సామాజిక మాధ్యమాల్లో చాలామంది వ్యక్తిగత, కుటుంబ ఫొటోలను పెడుతున్నారు. వీటిని ఇతరులు డౌన్‌లోడ్‌ చేయకుండా, కనిపించకుండా ప్రైవసీ లాక్‌ పెట్టుకోవడం లేదు. ఇది నేరగాళ్లకు వరమవుతోంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్‌ ఆడియో, వీడియో కాల్స్‌కు తెలియక ఆన్సర్‌ చేసి కష్టాల్లో పడిపోతున్నారు. ఇటీవల ఓ యువతికి ఇలాగే వాట్సాప్‌ వీడియోకాల్‌ వచ్చింది. ఆమె కేవలం 8 సెకన్లు మాట్లాడి రాంగ్‌ నంబర్ అని కట్‌ చేసింది. కొన్ని గంటల తరువాత ఆ యువతి వీడియో కాల్‌ను మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అవగాహన లేక : కొంతమంది నేరస్థులు పంపుతున్న ప్రమాదకరమైన లింక్‌లను క్లిక్‌ చేసినా తెరిచినా మన ఫోన్లు వారి ఆధీనంలోకి వెళ్లిపోయినట్లే. అనవసరమైన యాప్‌లను లోడ్‌ చేసి అడిగిన సమాచారం ఇచ్చి ప్రమాదంలో పడుతున్నవారు మరికొందరు. మహిళలు, యువతులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నప్పుడు పని అయ్యాక తమ ల్యాప్‌టాప్‌ల కెమెరాలు ఆఫ్‌ చేయడం మరచిపోతున్నారు. ఇదీ ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • మంగళగిరి సమీపంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తన దగ్గరున్నాయని, డబ్బులివ్వకపోతే ఇంటర్నెట్‌లో పెడతానంటూ ఓ వ్యక్తి బెదిరించాడు. ఇలా విడతలవారీగా రూ. 3 లక్షలు గుంజేశాడు. ఇంకా డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేయడంతో తన దగ్గర లేవని ఆమె చెప్పింది. అంతే అతడు ఆ ఫొటోలను ఇంటర్నెట్​లో పెట్టేశాడు. బాధితురాలు తన తల్లి సహాయంతో పోలీసులను ఆశ్రయించగా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి మాజీ ప్రేమికుడని తేలింది. అతను ఆ చిత్రాలు, వీడియోలు సేకరించి తన స్నేహితుడితో బాధితురాలికి ఫోన్‌ చేయించాడు. చివరకు వీరిద్దరూ కటకటాలపాలయ్యారు.
  • పాతగుంటూరుకు చెందిన ఓ వివాహితకు ప్రకాశం జిల్లా నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఆమె వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, కోరిక తీర్చాలని, లేదంటే బయటపెడతానంటూ బెదిరింపులకు గురి చేశాడు. పోలీసు విచారణలో నివ్వెరపోయే విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలికి తెలియకుండా ఆమె భర్తే ఫొటోలు, వీడియోలు తీసి కొంతమందికి అమ్మేసి ఫోన్‌ నంబర్ కూడా ఇచ్చేవాడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒక్క ఫోన్‌ చేయండి : మార్ఫింగ్‌ చేసిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఉన్నాయని ఎవరైనా బెదిరిస్తే భయపడవద్దని గుంటూరు అదనపు ఎస్పీ సుప్రజ తెలిపారు. వెంటనే 97464 14641 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. కళాశాలల్లో ఎస్పీ ఏర్పాటు చేసిన సైబర్‌ క్లబ్బుల్లో ఉన్న మహిళా పోలీసులను ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. లేదా సమీపంలోని పోలీస్‌స్టేషన్, ఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అత్యాధునిక పరిజ్ఞానంతో మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు తీసేస్తామని ఎస్పీ చెప్పారు.

‘నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయి - డబ్బులు ఇవ్వకుంటే నెట్​లో పెడతా'

భర్త పైశాచికం.. భార్య న్యూడ్​ వీడియోలు చిత్రీకరించి..

ABOUT THE AUTHOR

...view details