Woman Died in Road Accident in Hyderabad : కుమార్తెను బైక్‌పై తీసుకొచ్చి స్కూల్‌లో వదిలిపెట్టింది. బిడ్డను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. అనంతరం బై చెప్పి తిరిగి ఇంటికి బయల్దేరింది. కానీ విధి వెక్కిరించింది. ఆ తల్లిని లారీ మృత్యువు రూపంలో కబలించింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని నాచారం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే : బాగ్‌అంబర్‌పేట శ్రీనివాసనగర్‌లో విజయ్, అతని భార్య నీతా, కుమార్తె (10), కుమారుడు (4) నివాసం ఉంటున్నారు. కుమార్తె లౌక్య నాచారంలోని జాన్సర్ గ్రామర్ స్కూల్‌లో 5 తరగతి చదువుతోంది. ప్రతిరోజు లౌక్య స్కూల్ బస్సులోనే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తోంది. వినాయక చవితికి ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మంగళవారంతో (sep 17న) ముగిశాయి. బుధవారం (Sep 18న) ఉదయం స్కూల్ బస్సు రాలేదు. కుమార్తెను స్కూల్‌కు తీసుకెళ్లేందుకు నీతా తమ్ముడి బైక్‌ను తీసుకుని ఉదయం 7.45 సమయంలో ఇంటి నుంచి బయలుదేరింది.
8.20 గంటలకు స్కూల్‌లో తన కుమార్తెను వదిలిపెట్టి తిరిగి ఇంటికి పయనం అయ్యింది. పట్టుమని 10 నిమిషాలు గడవక ముందే మార్గమధ్యలోనే ప్రమాదం జరిగింది. నాచారం హెచ్‌ఎంటీ నగర్ కమాన్ ప్రధాన రహదారి వద్దకు రాగానే అదే మార్గంలో చర్లపల్లిలోని ఐఓసీ నుంచి గ్యాస్ సిలిండర్లు తీసుకుని రామ్‌నగర్‌కు బయలుదేరిన లారీ బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే నీతా కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నరేష్ పోలీసు స్టేషన్లో లొంగిపోయారని సీఐ రుద్విర్ కుమార్ తెలిపారు.