ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న మొండి చెయ్యి - తెగిన దారం పోగులా నేతన్నల బతుకులు - WEAVERS PROBLEMS

Weavers Problems in Andhra Pradesh : మన దేశంలో అత్యంత పురాతన వృత్తుల్లో చేనేత ఒకటి. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న రంగం కూడా ఇదే. అన్నింటికి మించి దేశంలోని చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఇక్కడి కార్మికుల నైపుణ్యానికి విదేశీయులు ఆచ్చెరువొందిన సందర్భాలనేకం. మన దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న సమయంలో చేనేత ఉత్పత్తులను అణచివేసి వారి దేశం నుంచి తెచ్చిన వస్త్రాలను ఇక్కడ విక్రయించే చర్యలు గట్టిగా జరిగాయి. దీంతో చేనేతలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది.

weavers_problems_in_andhra_pradesh
weavers_problems_in_andhra_pradesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 2:15 PM IST

Weavers Problems in Andhra Pradesh :నూలుపోగుతో నాగరికతకు నడకలు నేర్పిన గొప్పదనం చేనేత కళాకారులది. అగ్గిపెట్టెలో పట్టేలా అత్యంత కళాత్మకంగా చీరను నేసి బ్రిటీష్ మహరాణికి పంపి మెప్పించిన ఘనమైన చరిత్ర మన సొంతం. అలాంటి చేనేత కళాకారులు నేడు తిండికి, బట్టకు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. పెరిగిపోతున్న పవర్ లూమ్స్, చేనేతరంగానికి తగ్గిపోతున్న బడ్జెట్ దీనికి ప్రధాన కారణాలు. ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రోత్సాహకాలు అందక, రాయితీలు రాక నేతన్నల బతుకులు తెగిన దారం పోగులా తయారయ్యాయి.

ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఈ రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. సర్కార్‌ సహకారం అందక చేనేత వృత్తిని నమ్ముకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు, కార్మికుల జీవితాల్ని మెరుగుపర్చేందుకు కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత రంగ ఘన చరిత్ర ప్రస్తుత దుస్థితికి కారణాలు, కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కథనం.

విదేశీ పాలన కంటే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ రంగం మరింతగా ఒడిదుడుకులకు లోనైంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన పవర్ లూమ్స్ చేనేతను దెబ్బతీశాయి. మనుషులతో పెద్దగా అవసరం లేకుండా నడిచే పవర్ లూమ్స్‌తో చేనేతకు ప్రమాదం వచ్చిపడింది. దీంతో చేనేతలు తయారు చేసే 22రకాల ఉత్పత్తులను పవర్ లూమ్స్‌లో తయారు చేయొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది. తర్వాత ఈ రిజర్వేషన్ 11 రకాలనే పరిమితం చేసింది.

అయినా పవర్ లూమ్స్ యజమానులు నిషేధం పట్టించుకోకుండా చేనేతల్ని పోలిన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా చేతివృత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారికి ఇబ్బందిగా మారింది. అలాగే కేంద్రం చేనేత ముడిసరకుతో పాటు ఉత్పత్తులపై కేంద్రం విధిస్తోన్న జీఎస్టీ కూడా ఈ రంగానికి పెను భారంగా మారింది. కనీసం ముడిసరకుపై జీఎస్టీ తీసివేయడం ద్వారా చేనేతను కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే చేనేతల సంక్షేమానికి, సహకారానికి సంబంధించిన బడ్జెట్‌ను 200 కోట్లు మాత్రమే పెడుతున్నారు. దీన్ని కనీసం వెయ్యి నుంచి రెండు వేల కోట్లకు పెంచాలనే డిమాండ్ ఉంది.

కష్టాల కొలిమిలో ఫణిదం చేనేత సహకారం సంఘం - ఆశలన్నీ కూటమి ప్రభుత్వం పైనే - Phanidam Handloom Industry

'చేనేత రంగాన్ని ఆదుకునేందుకు గతంలో ప్రభుత్వాలు వివిధ రకాల పథకాల ద్వారా తోడ్పాటు అందించేవి. కానీ, వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఈ రంగాన్ని పూర్తిస్థాయిలో వదిలేశారు. జగన్ ఏలుబడిలో చేనేతలకు పావలా వడ్డీ రుణాలు చెల్లించలేదు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం పక్కనపెట్టింది. గతంలో చేనేత సహకార సొసైటీల్లో తయారు చేసే దుప్పట్లు, కండువాలు ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా చేసేవారు. విద్యార్థులకు యూనిఫాం వస్త్రాలూ చేనేత సొసైటీల నుంచి వచ్చేది. వాటిన్నింటినీ ఆపేయటంతో చేనేత సొసైటీల్లో పనిచేసే కార్మికులకు వారంలో 1, 2రోజులు మాత్రమే పని దొరుకుతోంది. ఆప్కో నుంచి కొనుగోళ్లు కూడా సరిగా చేయలేదు. గతంలో ముడిసరుకు కూడా ఆప్కో పంపిణీ చేసేది. అది కూడా సరిగా ఇవ్వలేదు. వీటన్నింటి దృష్ట్యా చాలామంది కార్మికులు పనిదొరక్క అవస్థలు పడ్డారు.'- పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 700 చేనేత సొసైటీల్లో 600 వరకూ తీవ్ర నష్టాల్లో కూరుకు పోయాయి. వసతి గృహాల్లోని విద్యార్థులకు యూనిఫాం సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పట్లో వైఎస్సార్సీపీ నేతలకు కట్టబెట్టారు. వాళ్లు పవర్ లూమ్స్ వారి వద్ద కొని ప్రభుత్వానికి సరఫరా చేశారు. చేనేత సొసైటీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఆపేయటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా ఏ ఏడాదికి రాయితీలు ఆ ఏడాది ఇచ్చేవారు. కానీ జగన్‌ హయంలో చేనేత ముడిసరుకుల మీద రాయితీ సొమ్ము, సంక్షేమ నిధులు, పావలా వడ్డీ పథకానికి సంబంధించి రాయితీల రూపంలో రావాల్సిన సొమ్ము 100 కోట్ల మేర బకాయిలు పెట్టారు. సొసైటీల ద్వారా కొన్న వస్త్రాలకు సంబంధించి మరో 100 కోట్లు రావాల్సి ఉంది. ఇలా చేనేత రంగంపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించిందని ఈ రంగానికి చెందిన వారే విమర్శిస్తున్నారు.

కునారిల్లుతోన్న పొందూరు ఖాదీ వస్త్ర పరిశ్రమ - ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్న చేనేతలు - Ponduru Khadi Workers Problems

మన రాష్ట్రంలో చేనేత రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వారు 5లక్షల మంది వరకూ ఉంటారు. వైకాపా ప్రభుత్వం నేతన్న నేస్తం పథకంలో చేనేత కార్మికుడికి ఏడాదికి 24వేలు చొప్పున ఇస్తామని చెప్పింది. లక్షలాది మంది కార్మికులు ఈ రంగంలో పని చేస్తుంటే 80 వేల546 మందికి మాత్రమే పథకం వర్తింపజేశారు. అదీ మగ్గం ఉన్నవారికే వర్తింపజేయటంతో లక్షలాది మంది దూరమయ్యారు. ఈ వృత్తిలో దశాబ్దాలుగా ఉన్న చాలామంది కార్మికులకు సొంత మగ్గాలు లేవు. కొందరు అద్దెకు మగ్గాలు సమకూర్చుకుని నేస్తుంటారు. అలాంటి వారికి కూడా పథకం అందలేదు. కొన్నిచోట్లయితే ప్రతిపక్షాల వారిని నేతన్న నేస్తం పథకం నుంచి తప్పించారు. పల్నాడు జిల్లా గారపాడులో అలా ఈ పథకానికి దూరమైన కొందరు హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలా చేసే వృత్తి ఆధారంగా అందించాల్సిన పథకాన్ని నిబంధనల పేరుతో, పార్టీల వంకతో తిరస్కరించి చేనేతల్ని ఆవేదనకు గురి చేశారు. పవర్ లూమ్స్‌ను కట్టడి చేసి చేనేత వస్త్రాల్లో 11రకాలకు రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

పవర్ లూమ్స్‌పై చేనేత రకాల్ని ఉత్పత్తి చేసేవారిపై 1985 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ఈ రంగానికి ఊతమివ్వాల్సిన అవసరం ఉంది. నూలు, పట్టు, జరీ, రంగులు, రసాయనాల ధరలను తగ్గించటం ద్వారా చేనేత ఉత్పత్తుల తయారీపై భారం తగ్గించాలి. చేనేత కార్మికులకు గత తెదేపా ప్రభుత్వం 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించింది. జగన్ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా యాడికిలో మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దాన్ని రాష్ట్రంలోని కార్మికులందరికీ వర్తింపచేయాలని కోరుతున్నారు.

చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉండి కార్మికులు ఇబ్బందులు పడుతున్న వేళ నారా లోకేశ్​ సరికొత్త ప్రణాళికలతో ముందుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆధునిక రీతిలో వీవర్ శాల ఏర్పాటు చేశారు. మగ్గం నుంచి ముడిసరకు వరకూ ఆధునిక పరిజ్ఞానాన్ని చేనేతలకు అందించటం, రంగుల నుంచి డిజైన్ల వరకూ తోడుగా నిలబడటం, బ్రాండింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ చేయూత అందించటమే లక్ష్యంగా ఈ మోడల్ షెడ్ పనిచేస్తుంది. చేనేతలు తమ వృత్తిని గౌరవంగా కొనసాగించటంతో పాటు ఆదాయం పెంచుకునేలా తీర్చిదిద్దారు. దీనికోసం పురాతన గుంత మగ్గాలకు స్వస్థి పలికి ఆధునిక స్టాండ్ మగ్గాలు సమకూర్చారు. అలాగే మంగళగిరి చిన్న అంచు డిజైన్లు కాకుండా పెద్ద అంచులతో కూడిన డిజైన్లతో చీరలు నేసేలా జకార్డ్ పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు. చేనేతల రోజువారి ఆదాయం పెంచటం కోసం చర్యలు చేపట్టారు. ఈ మోడల్ షెడ్లో ప్రస్తుతం 20 మగ్గాలున్నాయి. అలాగే నేతకు కావాల్సిన ఇతర పరికరాల్ని అందుబాటులో ఉంచారు.

చేనేతలకు ఉన్న మరో సమస్య బ్రాండింగ్, మార్కెటింగ్. మంగళగిరి చేనేతకు దేశవ్యాప్తంగా మంచిపేరుంది. దీన్ని ఆసరాగా చేసుకుని పెద్దపెద్ద వ్యాపారులు సంపాదిస్తున్నా కార్మికులకు ఆ మేరకు ఆదాయం రావటంలేదు. ఇప్పుడు వీవర్స్ డైరక్ట్ పేరుతో ఓ బ్రాండ్ రూపొందించారు. దేశంలో ఎక్కడ ఎవరికి మంగళగిరి చేనేత కావాలన్నా ఈ బ్రాండ్ మీద సరఫరా చేస్తున్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన తనేరా కూడా మంగళగిరి చేనేత ఉత్పత్తుల కొనుగోలు చేస్తోంది. వస్త్రాల నాణ్యతకు సంబంధించి తనిఖీ చేయటంతో పాలు సలహాలు, సూచనలు ఇస్తోంది. చేనేతల ఆదాయం, జీవన ప్రమాణాలు పడిపోవటంతో ఏటా 10% మంది ఈ వృత్తిని వదిలేస్తున్నారు. వారు ఇదే పని చేసుకుంటూ ఆదాయం రెట్టింపు చేయాలన్న నారా లోకేశ్​ సూచన మేరకు తెదేపా NRI విభాగం ఈ సముదాయాన్ని ఏర్పాటు చేసింది. 6 నెలల నుంచి ఇది విజయవంతంగా నడుస్తోంది. కార్మికులకూ లబ్ధి చేకూరింది. ఈ తరహా వీవర్ శాలల్ని రాష్ట్రంలో చేనేతలు ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.

మంగళగిరిలో ఏర్పాటు చేసిన వీవర్ శాల కార్మికుల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించేలా డిజైన్ చేశారు. గుంటమగ్గాలపై వస్త్రాలు నేస్తే శారీరక శ్రమ అధికం. సరైన గాలి వెలుతురు లేని షెడ్లు, ఇళ్లలో మగ్గం పని చేయటం అసౌకర్యంగా ఉండేది. ఇప్పుడు గాలి, వెలుతురు బాగా ఉండేలా మగ్గాల సముదాయాన్ని డిజైన్ చేశారు. ఆధునిక డిజైన్లు కావటంతో చీరలకు ఎక్కువ ధర లభిస్తోంది. ఇలాంటి సముదాయాలు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటైతే చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో పాటు చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.

చేనేత కార్మికుల పొట్టకొట్టిన జగన్​ సర్కార్​ - షరతులతో నేతన్న నేస్తానికి కోత - CM Jagan Neglect Handloom Workers

ABOUT THE AUTHOR

...view details