Wealth Looted From Agrigold Lands in Nellore :అగ్రిగోల్డ్ భూముల్లో సంపద లూటీకి గురవుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 16 వందల ఎకరాల అగ్రిగోల్డ్ భూములను 2014లో టీడీపీ ప్రభుత్వం జప్తు చేసింది. వాటిల్లోకి ఎవరూ ప్రవేశించరాదని ఆ భూముల్లోని చెట్లను నరకరాదని బోర్డులు పెట్టించింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బోర్డులను తొలగించారు. ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న చెట్లను అమ్ముకుంటూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. భూములు అమ్మి బాధితులకు బకాయిలు చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వం 2014లో ఆదేశాలు ఇచ్చినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. బాధితుల సమస్యలను పరిష్కరించలేదు. నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం మండలాల్లో సుమారు 16 వందల ఎకరాలకుపైగా అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి.
ఇందులో జామాయిల్ చెట్లు పెంచుతున్నారు. వీటిని కొట్టి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. భాస్కరాపురం, జంగారెడ్డిపల్లి, కనియంపాడు, రాచావారిపల్లి, తెల్లపాడు గ్రామాల్లోని భూముల్లో పదేళ్లు నుంచి ఉన్న జామాయిల్ వృక్షాలు ఏపుగా పెరిగాయి. కానీ ఈ చెట్లను నరికేస్తూ స్థానిక నాయకులు వ్యాపారం చేస్తున్నారు.
జామాయిల్ కర్రకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. టన్ను ధర 7 నుంచి 8 వేలు పలుకుతోంది. కర్రను అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. నియోజకవర్గంలో కొందరు నాయకులు అండదండలతోనే ఈ దోపిడీ జరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సీఐడీ అధికారులూ దోపిడీని పట్టించుకోవడం లేదన్న స్థానికులు ఇప్పటికే 5వేల టన్నుల కర్రను తరలించినట్లు చెబుతున్నారు.