Water Problems in Andhra Pradesh: పేదల పక్షపాతినని పెత్తందార్లపై యుద్ధం చేస్తున్నానని మైకు దొరికినప్పుడల్లా సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. కానీ వాస్తవానికి వస్తే గ్రామాలకు తాగునీరు అందించకుండా ఆయన పేదలపైనే యుద్ధం చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా వందల గ్రామాల్లో ప్రజలు దాహం కేకలు పెడుతున్నా జగన్ మొద్దునిద్ర వీడలేదు. కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టకపోగా పాతవాటిని నిలిపివేసి ప్రజలపై కక్ష సాధించారు. గత్యంతరం లేక ప్రాణాలు నిలుపుకునేందుకు కొంతమంది సుదూర ప్రాంతాలకెళ్లి నీరు తెచ్చుకుంటుంటే మరికొంత మంది డబ్బులిచ్చి మరీ కొనుకుంటున్నారు. తమ దాహం కేకలు పట్టించుకోని జగన్‌ను ఈసారి నమ్మే పరిస్థితి లేదని ప్రజలు తెగేసి చెబుతున్నారు.
జగన్ సర్కారు నిర్లక్ష్యంతో నీటి కోసం ప్రజల అవస్థలు - water crisis at kurnool
Summer Water Crisis:తీవ్ర కరవు మండే ఎండలు ఐదు రోజులకోసారి తాగునీళ్లు 10 రోజులకు ఒకసారి స్నానం ప్రకాశం జిల్లా సహా రాయలసీమ ప్రాంతాల్లో పరిస్థితులివి. ఇంతటి దుర్భిక్షంలోనూ ప్రజలగోడు పట్టించుకోని ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. లక్షల కోట్లు అప్పులు చేసే ఆయనకు గ్రామాల్లో నీటి సరఫరాకు రూ.70 కోట్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు రక్షిత నీరు ఇవ్వాలనే ప్రభుత్వ బాధ్యతను పక్కన పడేసి పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థుల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. గుక్కెడు నీరు దొరక్క జనం గొంతెండి రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి తీరున జగన్ కూడా ఎన్నికల బస్ ఎక్కి ఐప్యాక్ ప్రాయోజిత నటనతో అబద్ధాల ఫిడేలు వాయిస్తున్నారు. కరవు రోజుల్లోనూ కళ్లు తెరవని ఇలాంటి నేతలు మళ్లీ గెలిస్తే పల్లెలు బతికేదెలా? జనం గొంతు తడిచేదెలా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు తాగునీరు లేదు - ఈ వేసవి ఎలా గడుస్తుందో : చంద్రబాబు - Water crisis in ap
గ్రామాల్లో ప్రజల దాహం కేకలు: ఐదేళ్ల సుదీర్ఘ పాలనలో సీఎం జగన్ ఏనాడూ తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. రక్షిత నీరివ్వడం పాలకుల కనీస బాధ్యత అని ఎప్పుడూ ఆలోచించలేదు. గత సంవత్సరం ఆగస్టు నుంచి రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులున్నా ఐదు, ఆరు నెలలుగా కోస్తా, రాయలసీమల్లోని వేల గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నా దాన్నొక సమస్యగానే గుర్తించకుండా మొద్దునిద్రలో జోగారు. కరవును గుర్తించలేదు సరికదా దుర్భిక్షం వెంటాడుతున్న సమయంలోనూ కనికరం లేకుండా అక్కడక్కడా తిరిగే నీటి ట్యాంకర్లనూ నిలిపి వేయించారు. కిలోమీటర్లు ప్రయాణించినా బిందెడు నీళ్లు దొరక్క జనం విలవిల్లాడుతుంటే తాను మాత్రం మేమంతా సిద్ధమంటూ వెళుతున్నారు.
వైసీపీ వచ్చాక రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా కొత్త తాగునీటి ప్రాజెక్టులు లేవు. 250కి పైగా రక్షిత నీటి పథకాల నిర్వహణకు నిధులివ్వకుండా చేసి వాటిని పాడుబెట్టారు. ఇంటింటికీ రక్షిత నీరిచ్చేందుకు టీడీపీ హయాంలో ప్రారంభించిన రూ. 26,769 కోట్ల ప్రాజెక్టును అటకెక్కించేశారు. ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులే తప్ప ఓటేసిన ప్రజలకు గుక్కెడు నీరిచ్చి దాహం తీరుద్దామనే ఆలోచన గతంలో పంచాయతీరాజ్‌శాఖగా చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ లేకపోయింది. తాగునీటి పథకాల నిర్వహణను పక్కన పడేసి గనులు, తవ్వకాలు, విద్యుత్తు కాంట్రాక్టులే లక్ష్యంగా ఆయన అధికారం వెలగబెట్టారు. ఆ శాఖ ప్రస్తుత మంత్రి ముత్యాలనాయుడికి రాష్ట్రంలో ఎక్కడెలాంటి పరిస్థితి ఉందో అసలు తెలియనే తెలియదు. తీవ్ర కరవు నేపథ్యంలో ఉపశమన ప్రణాళిక అమలు చేయాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తనకు జీతమిచ్చే ప్రజల కంటే పదవిలో కూర్చోబెట్టిన జగన్ సేవే ముఖ్యం అన్నట్లుగా తరిస్తున్నారు.
గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో - కోన గ్రామస్థుల ఆవేదన - WATER PROBLEM IN KONA
రాష్ట్రంలో డిసెంబరు నుంచి నీటి ఎద్దడి మొదలైంది. పల్లెల్లో వేల బోర్లు నీరులేక మొరాయిస్తున్నాయి. చెరువుల్లో చుక్కనీరు లేదు. వాస్తవానికి 2023 ఆగస్టులో సాధారణం కంటే 55 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అక్టోబరులో 88 శాతం, నవంబరులో 31శాతం తక్కువ వానలు కురిశాయి. డిసెంబరులో తుపాను ప్రభావంతో వారంపాటు వానలు కురిసినా తర్వాత మళ్లీ కరవు పరిస్థితులే నెలకొన్నాయి. ఈ ఏడాది జనవరిలో 77.5 శాతం, ఫిబ్రవరిలో 99 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇంతగా వర్షాభావం వెంటాడుతుంటే అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తాగునీటి ఎద్దడి వస్తుందని ముందే ఆలోచిస్తుంది. ఉపశమన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది. అయితే జగన్ సర్కారు మాత్రం పల్లెజనాన్ని బూటకపు మాటలతో మాయచేయాలనే చూస్తోంది.
ఉమ్మడి కడప జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రమైనా జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. బిందెడు నీటి కోసం వ్యవసాయ పొలాల్లోకి, పొరుగు గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. కొన్ని చోట్ల నాలుగైదు రోజులకోసారి నీళ్లిస్తున్నారు. 18 మండలాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య నెలకొంది. సీఎం సొంత ఇలాకా పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలు, ఒంటిమిట్ట, సంబేపల్లి, మైలవరం, రాయచోటి, మండలాల్లోని ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. ఇసుక తవ్వకాలతో భారీగా చేపట్టడంతో ఊటనీరు దిగువకు వెళ్లిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు కూడా మానుకుని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు, ఎద్దులబండ్లు, ట్రాక్టర్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్లు కొనుక్కుని మరీ నీరు తాగాల్సిన దుస్థితి నెలకొంది.
నీటి కటకట - గత్యంతరం లేక మురికినీళ్లే తాగుతున్న కోడూరు వాసులు - Water Crisis in Kodur
తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభించి తర్వాత కలెక్టర్ నుంచి అనుమతి తీసుకునే పరిస్థితి గతంలో ఉండేది. వైసీపీ వచ్చాక ముందు అనుమతి తీసుకున్నాకే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించింది. ఆ అనుమతులకు కనీసం 10 రోజులు పడుతుండటంతో అప్పటి వరకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని వందల గ్రామాల్లో తాగడానికి నీరు దొరకడం లేదు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని అత్యధిక ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
నంద్యాల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల ట్యాంకర్ల యజమానులను ఒప్పించి నీటి సరఫరా చేయిస్తున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదు. కొన్ని గ్రామాల్లో ప్రజలు పది రోజులకోసారి స్నానం చేస్తున్నారంటే నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని చోట్లా తాగునీటి సమస్య ప్రబలమవుతోంది. అధికారులు రూ.70 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించగా ముందు నీటి ఇబ్బంది లేకుండా చూడండి నిధుల సంగతి తర్వాత చూద్దామని ప్రభుత్వం చెబుతోంది.
బస్సు యాత్ర సందర్భంగా మార్చి 29న కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కొత్తూరు మహిళలు బిందెలతో వచ్చి తాగునీరు ఇవ్వాలంటూ సీఎంను నిలదీశారు. వారంతా రెండు నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. జగన్‌ను అడ్డుకున్న తర్వాత తుంగభద్ర లోలెవల్ కెనాల్ నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. అంటే సీఎంను అడ్డుకుంటేనే నీరు లేదంటే పట్టించుకునే పరిస్థితే లేదు. మరోవైపు చాలా ప్రాంతాల్లో బిందెలతో మహిళలు రోడ్డెక్కుతున్నా వారంతా ఎక్కడ సీఎం దగ్గరకు వస్తారో అని పోలీసులు ముందే అప్రమత్తమై దగ్గరకు రానీయడం లేదు.
వైసీపీ నేతల ఇసుక దాహం- అడుగంటిన వైఎస్సార్ జలాశయం - Drinking Water Problems