Water Crisis In Telangana 2024 :రాష్ట్రంలో నీటి వినియోగం 50 రోజులుగా భారీగా పెరిగింది. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్ల ద్వారా నీటిని తోడుతున్నారు. పశుగ్రాసానికి, తాగు నీటికి, కోళ్లఫారాల్లోనూ నీటి వినియోగం పెరిగింది. కృష్ణా పరీవాహకంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి జూరాలకు 154 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశైలానికి 115 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నారాయణపూర్ నుంచి కనీసం ఐదు టీఎంసీలు దిగువకు విడుదల చేయాలని కర్ణాటకను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Water Problem in Telangana :నారాయణపూర్‌లో 20 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జూరాల కింద తాగునీటి అవసరాలకు ముందుగా నీటిని కోరే అవకాశాలు ఉన్నట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. జూరాల జలాశయంలో 50 రోజుల వ్యవధిలో 1.85 టీఎంసీల వినియోగం నమోదైంది. ఈ జలాశయం వేగంగా అడుగంటుతోంది. జూరాల కింద పంటలు సాగు చేసిన రైతులు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం అనంతరం జూరాలకు ఏటా కనీసం రెండున్నర టీఎంసీలు ఎగువనున్న కర్ణాటక నుంచి వచ్చేవి. ఈ ఏడాది చుక్కనీరు కూడా రాలేదని రైతులు చెబుతున్నారు. బీమా నది కూడా ఎండిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన లోపాలు :కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తలెత్తిన లోపాలతో వాటిని ఖాళీ చేశారు. మేడిగడ్డ వద్ద రోజూ ఐదు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నా పిల్లర్లు కుంగడంతో దిగువకు వదిలేస్తున్నారు. అన్నారంలోనూ నిల్వ ఉన్న రెండున్నర టీఎంసీలను బుంగల కారణంగా వదిలేశారు. ఎగువకు ఎత్తిపోతలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ప్రభావం ఎల్లంపల్లి, మధ్య, దిగువ మానేరుల్లో నీటి మట్టాలపైచూపిస్తోంది. ఈ ఏడాది వానాకాలంలో వచ్చిన ప్రవాహాలే తప్ప అనంతరం ఇన్‌ఫ్లోలు లేవు.