Sexual Assault on Girls in Eluru District : నేటి కాలంలో రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్లయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. ఆడవారు అర్ధరాత్రే కాదు పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
తాజాగా వసతిగృహం ముసుగులో ఓ కామాంధుడు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఫొటోషూట్లంటూ ఆశ చూపి, మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు. బాధితుల్లో ముగ్గురు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏలూరు జిల్లాలో ఓ ఆశ్రమం పేరుతో బాలికల వసతిగృహం ఉండేది. సుమారు 50 మంది అక్కడ వసతి పొందుతూ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు.
Wardens Husband Misbehavior Girls : కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు వసతిగృహాన్ని సరిగా పట్టించుకోలేదు. దీంతో నెమ్మదిగా ఏలూరువాసి శశికుమార్ దానిని చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ వార్డెన్గా పని చేస్తున్నాడు. ఏలూరులో ఫొటో స్టూడియో సైతం నడుపుతున్నాడు. వసతిగృహం వద్ద వార్డెన్గా తన రెండో భార్యను, సంరక్షకురాలిగా మేనకోడలిని పెట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.