special trains for elections in AP:హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు ఈ సారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సొంతూళ్లకు వచ్చేందుకు సరిపడా రవాణా సదుపాయాల్లేక ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. రైళ్లలో వద్దామంటే బెర్తులన్నీ ఎప్పుడో నిండిపోయాయి. ఆర్టీసీ బస్సెక్కుదామంటే జగనన్న ఛార్జీల బాదుడుతో వెనక్కి తగ్గుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ సిబ్బంది రెచ్చిపోతున్నారు. మూడింతలు ఛార్జీలు పెంచి నిలువు దోపిడీ చేసేందుకు ప్లాన్ వేశారు. ఇన్ని అవాంతరాల మధ్య ఇక ఊరెలా వెళ్లేది, ఓటెలా వేసేది అన్నట్లు ఉంది ఏపీ ఓటర్ల పరిస్థితి.
రాష్ట్రంలో ఈ నెల 13 న పోలింగ్ జరగనుంది. ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు సొంతూళ్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏపీవాసులు 30 లక్షల పైనే ఉంటారని అంచనా. వీరంతా పోలింగ్ రోజున ఓటేసేందుకు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. మూడ్రోజుల ముందుగానే స్వరాష్ట్రానికి వచ్చేలా రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఏపీ మీదుగా వెళ్లే రైళ్లలో మే 8 నుంచి 13 వరకు వరకు బెర్తులన్నీ ఫుల్ అయిపోయాయి. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత దర్శనిస్తోంది. సాధారంగా పండుగ సమయాల్లో, రద్దీ రోజుల్లో రైల్వేశాఖ అదనపు రైళ్లను పట్టాలెక్కిస్తుంది. సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ్ రైళ్లనూ నడుపుతోంది. గతంలో ఎన్నికల ముందు కూడా ఇలాంటి రైళ్లను నడిపారు. కానీ ఈసారి ఓట్ల పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లను నడపడం లేదు. ఫలితంగా లక్షలాది ఓటర్లు ఈ సారి ఓటింగ్‌కి వస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను 3 సార్లు పెంచింది. హైదరాబాద్ నుంచి కుటుంబంతో సహా విజయవాడకు వచ్చి పోవాలంటే కనీసం 5 వేలు టికెట్ ఛార్జీలకే చెల్లించాలి. ఇంతకు మించి దూరమైతే అదనపు భారం తప్పదు. దీంతో ఆర్టీసీ బస్సెక్కేందుకే జనం జంకుతున్నారు. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు ఆపరేటర్లు మూడింతలు ఛార్జీలు పెంచి దండుకుంటున్నారు. పోనీ ఎలాగోలా వచ్చేద్దామనుకుంటే.. మళ్లీ తిరుగు ప్రయాణంలోనూ బాదుడు తప్పదు. దీంతో చాలా మంది ఓటర్లు ఊళ్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
జగన్ పాలన విభజన కంటే రెట్టింపు బాధ - ప్రభుత్వ వ్యతిరేకతలో ఫ్యాన్ కనుమరుగు: చంద్రబాబు - Chandrababu Naidu Interview