Vizianagaram Sisters Show Talent in Martial Arts Taekwondo and Fencing : అమ్మాయిలు చదువుతోపాటు ఆటల్లో రాణిస్తే జీవితంలో మరింతగా ఉపయోగపడుతుంది. తండ్రి ప్రోత్సాహంతో ఆ ఇద్దరు అమ్మాయి అదే మార్గం ఎంచుకున్నారు. చదువుకుంటూనే తైక్వాండో, ఫెన్సింగ్ క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మెరిశారు. లక్ష్యం నెరవేర్చుకోవడానికిమరింతగా సాధన చేస్తున్నారు.
విజయనగరానికి చెందిన శ్రీరూప్య,రేణుకలుక్రీడల్లో సత్తా చాటుతున్నారు. తండ్రి మొక్కర శ్రీనివాసు అటవీశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇతడికి చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. కానీ, ఎదిగే క్రమంలో ఆర్థిక పరిస్థితులు అడ్డుపడ్డాయి. తన ఇద్దరు కుమార్తెలుఆటలపై మక్కువ చూపడంతో పాఠశాల రోజుల నుంచే సాధన చేసేలా ప్రోత్సహిస్తున్నాడు.
చదువుతో పాటే ఉద్యోగాల వేట - ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటేలా శిక్షణ - Campus Recruitment Training
జాతీయస్థాయిలో సత్తా :తండ్రి శ్రీనివాసు నమ్మకం వమ్ము చేయకుండా పిల్లలు కూడా జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నారు. పెద్ద కుమార్తె శ్రీరూప్య 11 సంవత్సరాల నుంచి ఫెన్సింగ్ ఆడుతోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఈమె ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 4 బంగారు, 6 వెండి, 3 కాంస్యాలు సాధించింది. జాతీయస్థాయిలోనూ సత్తా చాటుతూ 6 పతకాలు సొంతం చేసుకుంది. శ్రీనివాసు చిన్నకుమార్తె రేణుక ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతోంది. తైక్వాండో పోటీల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి కలిపి 19పతకాలు సాధించింది. అంతేగాక సోదరి శ్రీరూప్య ద్వారా స్ఫూర్తి పొంది ఫెన్సింగ్ నేర్చుకుంది. ప్రతిభతో నాలుగు సార్లు జాతీయ స్థాయిలో పాల్గొంది ఈ యువ క్రీడాకారిణి.