Vizianagaram political review : విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాలున్నాయి. జిల్లాలో ఓటర్ల సంఖ్య 13 లక్షల 57 వేల 492. పురుష ఓటర్లు 7 లక్షల 50 వేల 120మంది కాగా మహిళా ఓటర్లు 7 లక్షల 58 వేల 388 మంది. ట్రాన్స్ జెండర్స్ 59 మంది. మొత్తం ఓటర్లలో యువతే అధికం.
ఎన్డీఏ కూటమి తరఫున కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ బరిలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లా వరహనరసింహపురానికి చెందిన ఈయన తెలుగుదేశంలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజాదరణ పొందారు. వైఎస్సార్సీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ తలపడుతున్నారు. 2019లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధి అశోక్ గజపతిరాజుపై బెల్లాన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అధిష్ఠానం మరోసారి ఈయనకే ఎంపీ టిక్కెట్ కట్టబెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Vizianagaram Constituency :విజయనగరం పార్లమెంటు పరిధిలో జిల్లా కేంద్రం విజయనగరం ఎంతో కీలకం. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజు బరిలో నిలిచారు. 2019లో ఓటమి పాలైనా, తాజా ఎన్నికల్లో మరోసారి గత ప్రత్యర్థి కోలగట్ల వీరభద్రస్వామితోనే తలపడుతున్నారు. కోలగట్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2019లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి ఉప సభాపతిగా కొనసాగుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా కాంగ్రెస్ తరపున సుంకర సతీష్ పోటీలో ఉన్నారు.
Bobbili Constituency : బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్ధి బేబినాయనది వెలమ సామాజిక వర్గం. 2014 లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి., అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కూటమి తరఫున బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మళ్లీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మరిపి వినయ్ కుమార్ తలపడుతున్నారు.
చిరుధాన్యాల కోట అనంతపురం - రసవత్తరంగా రాజకీయం - Anantapur LOK SABHA ELECTIONS
Gajapatinagar Constituency :గజపతినగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ బరిలో నిలిచారు. దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనువడు. ఆ కుటుంబం నుంచి మూడో తరం నేతగా శ్రీనివాస్ రాజకీయ అరగ్రేటం చేశారు. ఈ స్థానానికి వైఎస్సార్సీపీ సిటింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య బరిలోకి దిగారు. నాలుగోసారి ఈ స్థానం నుంచే టికెట్ దక్కించుకున్నారు. ఏపీసీసీ శిక్షణ సెల్ డైరెక్టర్ గా పని చేసిన డోలా శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు.
Rajam Constituency : రాజాం నియోజకవర్గ కూటమి అభ్యర్ధి కోండ్రు మురళీమోహన్. 2014, 2019లో ఇదే స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి, వైఎస్సార్సీపీ అభ్యర్ధి కంబాల జోగుల చేతిలో ఓటమి పాలయ్యారు. రాజాం నుంచే మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కుమారుడు డాక్టర్ తలే రాజేష్ కు వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున కంబాల రాజవర్థన్ పోటీలో ఉన్నారు. ఈయన 2019 నుంచి పార్టీలో అనేక పదవులు నిర్వహించారు.