Vizianagaram Farmer Cultivates 12 Varieties Of Desi Paddy :అనూహ్యంగా ఎదురయ్యే కొన్ని ఘటనలు మన జీవిత గమ్యాన్ని మారుస్తాయి. అప్పటిదాకా సాగుతున్న ప్రయాణాన్ని కాదని, కొత్త ప్రస్థానానికి నాంది పలుకుతాయి. ఏపీలోని విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గొల్జాం గ్రామస్థుడు తూర్పాటి సత్య నారాయణదీ అలాంటి ప్రస్థానమే.
తన తల్లిని క్యాన్సర్ పొట్టన పెట్టుకోవడంతో తీవ్రంగా మదనపడిన సత్య నారాయణ, రసాయన ఎరువులతో పండించిన ఆహార దినుసులు తీసుకోవడమే కారణమని గట్టిగా నమ్మారు. జీవన శైలిలో మార్పులతో పాటు ప్రకృతి సిద్ధంగా పండిన పంట ఉత్పత్తులనే ఆహారంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెస్సీ (MSC) గణితం చదివి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సత్య నారాయణ, సేంద్రియ సాగు వైపు మళ్లారు. ఒకనాటి దేశీయ వంగడాలను సేకరించిన ఆయన, విత్తనాలు తయారు చేసుకొని, సేంద్రియ పద్ధతుల్లో పండించి, సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తుల తయారీకి పూనుకున్నారు. ఇప్పుడతని అనుభవైక వైద్యం తోటి రైతులకు ఆదర్శ సేద్యం.
గోమూత్రంతో ఎరువులు :సత్య నారాయణ ఏడు సంవత్సరాల క్రితం గో ఆధారిత ప్రకృతి సాగును ప్రారంభించే మునుపు ప్రముఖ ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్, సేవ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ విజయరామ్‌ల నుంచి సూచనలు తీసుకున్నారు. గ్రామంలో తనకు ఉన్న ఐదు ఎకరాలకు తోడు ఎల్.కోటలో మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 13 ఎకరాల్లో 12 రకాల దేశీయ వంగడాల సాగు చేస్తున్నారు. సొంతంగా గోకులం నిర్మించుకొని పది ఆవులను పెంచుతున్నారు. గోమూత్రం ఆధారంగా ఘనామృతం, వాన పాములు, పంచగవ్య, వేపాకుతో నీమాస్త్రం, దశ పత్ర కషాయాలు తయారు చేసుకుంటారు. వాటిని పంటకు ఎరువులుగా ఉపయోగిస్తున్నారు.