Village Secretariat Employee Cheated Farmers in Prakasam District :రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని నగదు వసూలు చేసిన సచివాలయ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. దీనిపై నిందితుడి బాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దర్శి మండలం బసిరెడ్డిపల్లికి చెందిన సీహెచ్ నాగరాజు అనే రైతు చందలూరు సచివాలయంలో ఉద్యానశాఖ సహాయకునిగా పని చేస్తున్న దూపాటి జాన్‌గార్డన్‌కు ఈ నెల 2న రొటోవేటర్ నిమిత్తం రూ.72,500 నగదు చెల్లించారు. ఈ మేరకు రొటోవేటర్ (Rotavator)ను ఈ నెల 17 లోగా అందజేయకపోతే నగదు తిరిగి ఇచ్చేస్తానని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు.
గడువు ముగిసిన తర్వాత అతడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందని, అతడు ఇంతకుముందు చాలా మంది రైతుల నుంచి ఇలాగే నగదు వసూలు చేసి పరారయ్యాడని ఆయన ఆరోపించారు. దీనిపై కొందరు రైతులు పోలీసులను ఆశ్రయించటంతో ఆ ఉద్యోగి బంధువు బాధిత రైతులతో మాట్లాడి నగదు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల మిగిలిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ ఉద్యోగి పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు.
కేసు నమోదు :నిందితుడు జాన్ గార్డన్ ఆచూకీ లేదని బుధవారం అతని బాబాయి ఎలీషా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.