Vijayawada Railway Station Bagged 'Eat Right Station' Certification :దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే స్టేషన్ మరో గుర్తింపు సాధించింది. ప్రయాణికులకు నాణ్యమైన, శుచికరమైన ఆహారం అందించే స్టేషన్‌గా ఈట్ రైట్ స్టేషన్ ధ్రువపత్రం పొందింది. పరిసరాల పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందజేశారు.
బెజవాడ పేరు చెబితేనే భోజన ప్రియులకు నోటిలో నీళ్లు ఊరతాయి. రుచికి, శుచికి పెట్టింది పేరైన విజయవాడలో ఆహారపదార్థాలను చూస్తే ఆవురావురమంటూ ఆరగించాల్సిందే. దక్షిణ భారతంలోనే అతి పెద్ద జంక్షన్లలోని విజయవాడ రైల్వే జంక్షన్ ఒకటి. ప్రతిరోజూ లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన 300 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంటాయి.
లక్షలాది మంది ప్రయాణికులు నాణ్యమైన, రుచికరమైన ఆహారపదార్థాలు అందించేందుు వీలుగా స్టేషన్లో రెస్టారెంట్లు, క్యాంటీన్లు, హోటళ్లు, చిరుతిళ్ల దుకాణాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. వీటిని టెండర్ల ద్వారా ప్రవేట్ వ్యక్తులకు అప్పగించారు. నిరంతరం స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార తయారీ ప్రక్రియను తనిఖీలు చేస్తూ, పర్యవేక్షిస్తూ లోపాలను సరిదిద్దుతున్నారు. తద్వారా స్టేషన్‌లో రైలు దిగే ప్రయాణికులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.
వారు రైలు ఎక్కేందుకు క్యూ పద్ధతి - విజయవాడ రైల్వేస్టేషన్లో అమలు
ప్రయాణికులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని, సేవలను అందించే రైల్వేస్టేషన్లను గుర్తించి ప్రోత్సహించేందుకు రైల్వేశాఖ ఏటా ప్రతిష్టాత్మక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా తనిఖీలు నిర్వహిస్తుంది. లోపాలు సరిదిద్ది, నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించేలా ఆయా స్టేషన్లకు ఈట్ రైట్ స్టేషన్ అనే ధ్రువీకరణపత్రం జారీ చేసి ప్రోత్సహిస్తోంది. ఆరు నెలల క్రితం ప్రీ ఆడిట్‌లో భాగంగా సిబ్బంది విజయవాడ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసి లోపాలను సరిదిద్దారు.