Railway Tracks will Rehabilitation : భారీ వరదలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన జరుగుతోందని విజయవాడ డీఆర్ఏం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ట్రాక్ పనులు పూర్తి కాగానే హైదరాబాద్-విజయవాడకు రైలు సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం నీట మునిగిన రాయనపాడు రైల్వే స్టేషన్‌లో రెండు ట్రాక్‌లు బయటపడ్డాయని వాటి పటిష్ఠతపై భద్రత, సిగ్నలింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. మూడో ట్రాక్ కూడా తేలగానే పునరుద్ధరించనున్నట్టు తెలిపారు.
రైల్వే ట్రాక్ కింద వరద : కాజీపేట, మహబూబాబాద్ వద్ద ట్రాక్ నిర్మాణం పూర్తికాగానే రైళ్లు పట్టాలెక్కిస్తామన్నారు. వరద వల్ల ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో విజయవాడ డివిజన్‌లోనే మూడు రోజుల్లో 323 రైళ్లు రద్దు చేసినట్టు తెలిపారు. 173 రైళ్లు దారి మళ్లించి నడిపామని, 120 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్టు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ప్రవహించడంతో కృష్ణానదిపై నిర్మించిన రైల్వే ట్రాక్‌కి వరద తాకిందన్నారు. ఆ మార్గంలో ట్రాక్‌ను పరిశీలించామని పటిష్టంగా ఉందని పాటిల్ తెలిపారు. వరదల వల్ల 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాయనపాడు స్టేషన్లో నీటిలో నిలిచిపోగా 4500మంది ప్రయాణికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి బస్సుల్లో తరలించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు.