Vijayawada Recovering From Floods : బుడమేరుకు వరద తగ్గడంతో విజయవాడలోని కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వారం రోజులుగా జలదిగ్బంధంలోనే మగ్గిన భవానీపురం, సితార సెంటర్, విద్యాధరపురం నుంచి క్రమంగా నీరు వెళ్లి పోతోంది. జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, రాజరాజేశ్వరీ పేట, మిల్క్ ప్రాజెక్టు ప్రాంతంలో నీరు తగ్గింది. బుడమేరు కాలవకు పడిన గండ్లు పూడ్చివేయడంతో కాలనీల్లో నీరు తగ్గిందని స్థానికులు తెలిపారు. ఇన్నాళ్లు ఇబ్బందిపడ్డ తాము, ఇప్పుడిప్పుడే ఉపిరి పీల్చుకుంటున్నామని తెలిపారు.
"బుడమేరు మూడో గండి పూడ్చడంతో నగరంలో కొంతమేర వరద ఉద్ధృతి తగ్గింది. ఈ వరదల ధాటికి ముంపునకు గురైన ఇళ్లన్నీ బురదమయంగా మారి నిర్మాణాల సిల్ట్ ఊడిపోయింది. వరదొచ్చిన మొదటి రెండు రోజులు బాగా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు పర్లేదు. వరద ఉద్ధృతి తగ్గింది. సర్కార్ నుంచి సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి." -బాధితులు
నీరు తగ్గిన కాలనీల్లో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం :సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో పాదాలు తడిసేంత వరద నీరు నిలిచి ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వాంబే కాలనీలో క్రమంగా వరద తగ్గుతోంది. పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కార్మికులు ముమ్మరం చేశారు. కాలనీల్లో బ్లీచింగ్ చల్లే పక్రియ చురుగ్గా సాగుతుందని అధికారులు వెల్లడించారు.