Vijayawada Book Fair 2025 :విజయవాడలో పుస్తక మహోత్సవానికి వేళయ్యింది. ఈ పుస్తక మహోత్సవం మూడున్నర దశాబ్దాల మైలురాయిని ఘనంగా దాటనుంది. ఏటా సంక్రాంతికి ముందు జరిగే అతిపెద్ద పండగ పుస్తక మహోత్సవమే. ఈ ఏడాది 35వ పుస్తక మహోత్సవానికి పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. దీనికి నగరం మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వేదిక కావడంతో నిర్వాహకులు, పుస్తక ప్రియుల్లోనూ నూతనోత్సాహం సంతరించుకుంది. ఇప్పటికే 200కు పైగా ప్రచురణ సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం.
జనవరి 2 నుంచి 12 వరకూ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది. తొలిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వారితో పాటు కేెంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ పాల్గొంటారు.
'విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు సహా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి పుస్తక ప్రియులు వేల సంఖ్యలో నిత్యం తరలి వస్తుంటారు. 11 రోజుల్లో కనీసం 10 లక్షల మంది పుస్తకప్రియులు ఏటా తరలివస్తుంటారు. ఈ మహోత్సవంలో పుస్తకాలు కొనుక్కునేందుకు ఏడాదంతా డబ్బులు దాచుకుని మరీ చాలామంది వస్తారు.' - మనోహర్‌నాయుడు, పుస్తక మహోత్సవం కార్యదర్శి
పుస్తక మహోత్సవం ప్రాంగణం, వేదికలకు దివంగతులైన ప్రముఖుల పేర్లు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రామకోటేశ్వరరావు ప్రాంగణం:పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి పిడికిటి రామకోటేశ్వరరావు పేరు పెట్టారు. ఈయన సాహితీ నవజీవన్ బుక్‌లింక్స్ అధినేత.