VIJAYASAI REDDY CASE: జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) దాఖలు చేసిన అప్పీలుపై సీజే ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. వృత్తిపరమైన దుష్ప్రవర్తనపై విజయసాయిరెడ్డికి ఐసీఏఐ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐసీఏఐ దాఖలు చేసిన అప్పీలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఓ సంస్థ విచారణ నిర్వహిస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోజాలవని, విజయసాయిరెడ్డి చెన్నైలో చార్డర్డ్ అకౌంటెంట్‌గా నమోదు చేసుకున్నందున ఇక్కడి కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చే పరిధి లేదని ఐసీఏఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
స్టేకు నిరాకరణ: విజయసాయిరెడ్డి వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ఇందులో వాస్తవాలను తేల్చడానికి ఆయనను విచారించాల్సి ఉందని తెలిపింది. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా సింగిల్ బెంచ్ నోటీసులను రద్దు చేయడం తగదని, ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.