Boy Suffering From Skin Disease: ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎంతో ముద్దుగా ఉన్నాడు కదూ? ఆ బాలుడు వయసు పట్టుమని నాలుగేళ్లు లేవు. కానీ అంతుచిక్కని చర్మవ్యాధితో విలవిల్లాడుతున్నాడు. చర్మమంతా పగుళ్లతో, పుండ్లతో ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆ పుండ్లు చివరికి ముక్కు లోపల, చెవిలో, నోట్లో కూడా రావడంతో ఆ బాలుడు పరిస్థితి హృదయ విదారకంగా మారింది. నోరు తెరిచి ఏమి చెప్పలేకపోతున్నాడు.
మామూలుగా చర్మవ్యాధి వస్తే అది తగ్గే వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కొన్ని చర్మవ్యాధులు చాలా భయంకరంగా ఉంటాయి. మరికొన్ని వ్యాధులు పుండ్లు, గాయాలుగా మారి ప్రాణాలకు సైతం ప్రమాదం వాటిల్లే అవకాశముంది. పెద్ద వయస్సు వాళ్లే చర్మవ్యాధి వస్తే తట్టుకోలేరు. అలాంటిది నాలుగేళ్ల బాలుడు అరుదైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నాడు. తన బాధను కనీసం చెప్పుకోలేని స్థితిలో ఆ పిల్లాడు విలవిలలాడుతున్నాడు.
కడప శివారులోని ఆలంఖాన్‌పల్లెకి చెందిన ఖలీల్‌బాషా, భాను దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో లతీఫ్ చిన్నవాడు. ఖలీల్‌బాషా మెకానిక్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. లతీఫ్‌కు ఏడాది వయస్సు ఉన్నప్పుడు జ్వరం రావడంతో ఆసుపత్రిలో చూపించారు. అదే సమయంలో ఒళ్లంతా చిన్న చిన్న కరుపులు ఏర్పడ్డాయి.
ఆ తరువాత చర్మం ఊడిపోవడంతో తల్లిదండ్రులకు ఆందోళన మొదలైంది. ఒళ్లంతా కురుపులు ఏర్పడి ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. తల్లిదండ్రులకు దిక్కుతోచని స్థితిలో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, తిరుపతి, వేలూరు తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం లతీఫ్‌కు నాలుగేళ్లు వచ్చాయి.
రోజురోజుకూ బాలుడి వ్యాధి ముదురుతోంది. ఒళ్లంతా గాయాలు అవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కళ్లలో కూడా గుళ్లలు ఏర్పడ్డాయి. నోటిలో పుండ్లతో కనీసం ఆహారం తినలేక విలవిల్లాడిపోతున్నాడు. వైద్యులు పరీక్షించి అడపిక్ అలర్జీగా గుర్తించారు. ఎంతోమంది వైద్యుల వద్ద చూపించారు. కానీ ఫలితం లేదు. బాలుడికి 9 ఏళ్లు వచ్చేంతవరకూ ఏమీ చేయలేమని వైద్యులు చెబుతున్నారు. ఆ బాలుడు కనీసం రాత్రివేళ కూడా నిద్రపోవడం లేదు. ఎప్పుడూ బాలుడిని కాచుకొని తల్లిదండ్రులు గడపాల్సి వస్తోంది.
వైద్యం కోసం పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పామని, ఇంటిని సైతం అమ్మేసి రూ.20 లక్షలు ఖర్చు చేశామని లతీఫ్ తల్లిదండ్రులు వాపోయారు. రోజూ బాలుడి మందులకే దాదాపు రూ.2000 వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. వైద్యానికి అప్పులు చేయాల్సి వస్తోందని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. వారంలో నాలుగైదు రోజులు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తోందని, దాతలు స్పందించి సాయం చేయాలని బాలుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదుకోవాలంటూ లోకేశ్‌కు విజ్ఞప్తి - సీఎం సహాయనిధి నుంచి రూ.3 లక్షలు