Vijayadashami Festival 2024 :చెడుపై మంచి సాధించిన గెలుపే విజయ దశమి. దేశంలోని అనేక ప్రాంతాల్లో విజయదశమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి.. తొమ్మిది అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. శక్తి స్వరూణి, జగజ్జననిని, దుర్గామాతను నవరాత్రుల్లో విశేషంగా పూజిస్తారు. విజయదశమిని పురస్కరించుకుని పండుగ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం.
రాక్షస సంహారానికి ప్రతీక దసరా. చెడుపై మంచి గెలిచే తీరుతుందన్న సందేశాన్ని తెలిపే పండుగే విజయదశమి. విజయ దశమి విశిష్టతను తెలిపేలా అనేక పురాణ గాథలు ఉన్నాయి. అందులో ప్రధానమైనదే మహిశాసుర వధ. పూర్వం మహిశాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేసి ఏ పురుషుడి చేతిలో తనకు మరణం రాకూడదన్న వరం పొందాడని మన పురాణాలు చెబుతాయి. ఆ వరం కారణంగా దేవతలు, మానవులను వేధిస్తున్న మహిశాసురుడిని శక్తి స్వరూపిణి అయిన జగన్మాత తొమ్మిది రోజుల పాటు పోరాడి వధించింది. దానికి ప్రతీకగానే దేవీ శరన్నవరాత్రులు నిర్వహించి పదోరోజు విజయదశమి జరుపుకుంటారు.
"మహిశాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి చాలా సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఏ పురుషుడి చేతిలో కూడా నా ప్రాణం పోకుండా ఉండాలనే వరం కోరుకుంటాడు. దేవతలు, మనుషులను హింసించడం ప్రారంభిస్తాడు. దేవతలు అంతా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మహిశాసురుడి నుంచి రక్షించాలని వేడుకుంటారు. వరం ఇచ్చిన బ్రహ్మదేవుడే విరుగుడు చెప్పారు. మహిశారుడిని చంపే శక్తిని సృష్టిద్దామని అంటారు. అమ్మవారిని పూజించి దేవతలందరి శక్తిని కూడా ఒకే దగ్గర చేర్చి ఒక స్త్రీ రూపంలో మహిశాసురమర్ధిని సృష్టించారు. ఆ అమ్మవారు తొమ్మిది రోజులు మహిశాసురుడితో యుద్ధం చేసి ప్రపంచాన్ని రక్షించింది. చెడుపైన మంచి విషయం సాధించిన రోజే విజయదశమి." - గోపి కృష్ణ శర్మ, పూజారి
రాముడు రావణుడిని జయించిన రోజు : విజయదశమి రోజు నాడే రాముడు రావణుడిని జయించాడనే కథ ప్రాచుర్యంలో ఉంది. అలా చెడుపై మంచి గెలిచిన ఈ రోజునే విజయదశమిగా ప్రాశస్త్యం పొందింది. అందుకే పలు ప్రాంతాల్లో దసరా రోజు రావణుడి బొమ్మను కాల్చుతుంటారు.
జమ్మి చెట్టుకు పూజలు : ఇక ఈ రోజు జమ్మి చెట్టుని పూజించటం కూడా చూస్తుంటాం. పాండవులు అరణ్యవాసానికి వెళ్లెప్పుడు జమ్మి చెట్టుపై ఆయుధాలు ఉంచారని తిరిగి ఈ విజయదశమి రోజునే వచ్చి ఆయుధాలను తీసుకుని కౌరవులపై విజయం సాధించారని కూడా పురాణాలు చెబుతాయి. అలా విజయదశమి రోజున జమ్మిని పూజించటం ఆనవాయితీగా వస్తోంది. జమ్మి రూపంలోని అపరాజితా దేవిని పూజిస్తే తనను నమ్మిన వారికి విజయం వరించేలా దీవిస్తుందని భక్తుల విశ్వాసం.