Venkaiah Naidu Unveiled Idol of Jagarlamudi Kuppu Samy : అప్పట్లో విద్యా దాతల ఔదార్యంతో చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేశానని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. విద్యాదాతల ఆశయాలను గౌరవించి వారి బాటలో మన మందరం నడిచినప్పుడే వారికి మనమిచ్చే ఘన నివాళి అని తెలిపారు. బాపట్ల జిల్లా కారంచేడులో విద్యాదాత జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విగ్రహాన్ని వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు.
సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలి :ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, విద్యాదాత జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విద్యను ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు. కుప్పస్వామి చౌదరి వల్లే గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్, రామోజీరావు జీవితచరిత్ర అందరికి ఆదర్శమన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు చురుకుగా ఉండి ప్రజా సమస్యల పరిష్కరించాలని కోరారు. ప్రజా జీవితంలో ఉండేవారు మాటలు జాగ్రత్తగా మాట్లాడుతూ హుందాగా ఉండాలన్నారు. పిల్లలందర్ని అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలతో గడిపే విధంగా తల్లిదండ్రులు అలవాటు చేయాలని వివరించారు. వారికి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలని తల్లిదండ్రులకు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
రామోజీరావుతో అనుబంధం నాకెంతో అపురూపం - ఆ ఫొటోలు చాలా ప్రత్యేకం : వెంకయ్యనాయుడు - Venkaiah Naidu
వారి వద్దే లోక జ్ఞానం నేర్చుకున్నా: తన చిన్నతనంలో అమ్మ చనిపోయిందని అప్పటి నుంచి తన అమ్మమ్మ తాతయ్యల వద్దే లోక జ్ఞానం నేర్చుకున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. వ్యవసాయం మన సంస్కృతి, సంప్రదాయమన్నారు. చదువుతో పాటు సంస్కారాన్ని విద్యార్దులకు ఉపాధ్యాయులు నేర్పించాలని సూచించారు. కుప్పస్వామి చౌదరి మహోన్నత వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కొనియాడారు. అలాగే విద్యాదాత కుప్పు స్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబ శివరావు చెప్పారు. కార్యక్రమంలో కుప్పు స్వామి చౌదరి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు రాకతో కారంచేడులో బీజేపీ శ్రేణులు, చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎం కొండయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పోలీసులు సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
"విద్యాదాత కుప్పస్వామి చౌదరి ఎంతో మందికి ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించారు. అలాంటి వారి ఆశయాలను గౌరవించి వారి బాటలో నడవాలి. కుప్పుస్వామి చౌదరి, రామోజీ రావు లాంటి గొప్పవారి జీవిత చరిత్రలను చదవాలి. ఇలాంటి వారి చరిత్రలను చదవడమేగాక పిల్లలతోనూ చదివించాలి. అప్పడే వారిలో స్ఫూర్తి కలుగుతుంది. ఉపాధ్యాయులు పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలి."- వెంకయ్యనాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి
'తెలుగు జాతి స్ఫూర్తి, కీర్తి ఎన్టీఆర్'- మోదీ, చంద్రబాబు సహా ప్రముఖుల ఘన నివాళి - Chandrababu Pays Tributes to NTR
రామోజీరావు ఒక పోరాట యోధుడు- ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారు: వెంకయ్యనాయుడు - Venkaiah Naidu