Vemula Durga Rao revealed key facts: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అనుమానితుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. నాలుగు రోజుల పోలీసుల విచారణ తర్వాత బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్తో మాట్లాడిన దుర్గారావు కీలక విషయాలు వెల్లడించారు.
ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు: తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకుని వదిలేశారు, నాకు ఏంజరిగినా పోలీసులదే బాధ్యత, సీఎం జగన్ రాయి దాడి ఘటనకు నాకు ఎటువంటి సంబంధం లేదని వేముల దుర్గారావు అన్నారు. జగన్ పై జరిగిన రాయి ఘటనలో అనుమానితునిగా వేముల దుర్గారావును గత మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల అనంతరం పోలీసులు దుర్గారావును విడిచిపెట్టారు. వన్ టౌన్ సీసీఎస్ లో రెండు రోజుల పాటు విచారణ జరిపారని దుర్గారావు తెలిపారు.
అనంతరం మైలవరం పీఎస్ కు తీసుకువెళ్లి విచారించారన్నారు. మొదటి రోజు అర్ధరాత్రి సతీష్ ను తన ఎదుట కూర్చోపెట్టి విచారించారన్నారు. రాయి దాడి ఘటనకు తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు స్పష్టం చేసినట్లు దుర్గారావు తెలిపారు. కేసు సంబంధం లేదని ప్రస్తుతం నన్ను పోలీసులు విడిచిపెట్టారు, అయినా ఇంకా వారిపై అనుమానం ఉందన్నారు. టీడీపీ తరపున వడ్డెరకాలనీలో చురుకుగా వ్యవహరిస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని దుర్గారావు ఆరోపించారు. రాయి దాడి జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనన్నారు. రాయి దాడి ఎందుకు చేయించావని పోలీసులు విచారణలో పదేపదే ప్రశ్నించారన్నారు.
టీడీపీ నేతలు ఎవరైనా దాడి చేయించమన్నారా? అని ప్రశ్నించారని దుర్గారావు తెలిపారు. బోండా ఉమా దాడి చేయించారా అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిపారు. నాకు, టీడీపీ నేతలకు, రాయి దాడితో ఎటువంటి సంబంధంలేదని పోలీసులకు స్పష్టం చేశానన్నారు. విచారణలో పోలీసులు మానసికంగా వేధించారని తెలిపారు. సతీష్ మా కాలనీలో ఉంటాడని అన్నారు. పోలీసులు వడ్డెర కులస్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుందని దుర్గారావు ఆరోపించారు. కుల సంఘాల నేతలు, కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలిసి పోరాటం చేయటంతోనే పోలీసులు తనను వదిలిపెట్టారని దుర్గారావు పేర్కొన్నారు.
దుర్గారావు ఎక్కడ? - సీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన - Durga Rao Family Protest
ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి: పక్కా పథకంతోనే సతీష్ కు ఆశచూపి సీఎం జగన్ ను చంపేందుకే రాయి వేయించినట్లు చెప్పాలని విచారణలో దుర్గారావుపై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు న్యాయవాది సలీం ఆరోపించారు. పోలీసుల ఒత్తిడికి దుర్గారావు తలొంచలేదని నిజాన్ని నిర్భయంగా చెప్పారని సలీం అన్నారు. పోలీసులు వేధించారన్నారు. హెబియస్ కార్పస్ పిటీషన్ వేస్తారనే భయంతోనే దుర్గారావును విడిచిపెట్టారని ఆయన ఆరోపించారు. ఏ2గా బోండా ఉమాను ,ఏ3గా దుర్గారావును ఇరికించే ప్రయత్నం చేశారని సలీం ఆరోపించారు. దుర్గారావుకు అండగా ఉంటామని, న్యాయపోరాటం చేస్తామని న్యాయవాది సలీం తెలిపారు. దుర్గారావు బయటకు రావటంతో ఏ2 ఎవరు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
సీఎం జగన్‌పై రాయి దాడి కేసు - అనేక నాటకీయ పరిణామాల మధ్య దుర్గారావు విడుదల - Durga Rao Release
రాయి దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన దుర్గారావు