UTF Protest Against YSRCP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF)ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం నుంచి నాలుగు రోజులపాటు దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం పీఆర్సీ కమిటీని వేసినా దానికి విధి విధానం లేకుండా పోయిందని మండిపడ్డారు.
దాచుకున్న డబ్బుల్ని దోచుకున్న ప్రభుత్వం - ₹19వేల కోట్ల బకాయిపై ఉపాధ్యాయుల ఆగ్రహం
జగన్ ప్రభుత్వం ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగన్ సర్కార్ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటూనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
UTF Leaders Serious On YCP Govt :విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ మొండి వైఖరిని ఖండించారు. తామేమీ వేతనాలు పెంచమని కోరడం లేదని జీతం నుంచి దాచుకున్న సొమ్మునే ఇవ్వమని అడుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు నిధులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ అందలమెక్కాక మడమ తిప్పేశారని విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.