Usha Vance Grandmother Interview :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. అధ్యక్షుడిగా ట్రంప్ కొలువుదీరనుండగా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఆశీనులు కానున్నారు. ఈయన తెలుగు సంతతికి చెందిన ఉషా చిలుకూరికి భర్త. దీంతో అమెరికా సెకండ్ లేడీగా తెలుగమ్మాయి వ్యవహరించనున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ తెలుగు అల్లుడేనని మనవాళ్లంతా తెగ సంబరపడిపోతున్నారు.
అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి ఉషా పూర్వీకులది ఉయ్యూరు మండలం సాయిపురం కాగా ఆమె తల్లిది పామర్రు. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మిలు 1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. వీళ్లకు ముగ్గురు సంతానం కాగా వారిలో ఉష ఒకరు. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ రంగ నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్‌గా ఉంటూనే, శాన్‌డియాగో యూనివర్శిటీలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణ క్రిష్ చిలుకూరిగా అందరికీ పరిచయం. ఆయన ఏరోస్పేస్ ఇంజినీర్. యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. అంతే కాకుండా కాలిన్స్ ఏరోస్పేస్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.
Telugu Woman US Vice President Wife:చిన్నప్పటి నుంచే ఉషకు పుస్తకాలంటే ఇష్టం. ప్లస్ టూ తరవాత యేల్ లా స్కూల్‌లో చేరారు. అక్కడే వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో వారిద్దరూ కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అనే అంశంపై ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వారి స్నేహం మెల్ల మెల్లగా ప్రేమగా మారింది. 2014లో హిందూ పద్ధతిలో కుటుంబసభ్యల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వాన్స్ పొలిటికల్ కెరియర్‌ను తీర్చిదిద్దడంలోనూ ఉష కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచార బాధ్యతల్ని ఆమె తలకెత్తుకున్నారు.