Brutally Beat Children Incidents in AP : పసికూనలపై క్రూర మృగాలు సైతం కనికరం చూపిస్తూ వాటిని చంపకుండా వదిలేస్తుంటాయి. అలాంటి వీడియోలు చూస్తుంటే అన్ని ప్రాణుల్లోనూ దయా, జాలి ఉంటాయని అనిపిస్తుంది. ఒక్కోసారి బిడ్డను కాపాడుకునేందుకు తల్లే వాటికి తన ప్రాణాన్ని అడ్డువేస్తుంది. అదే కదా! మాతృత్వం అనుకుంటూ కళ్లలో సుడులు తిరుగుతున్న కన్నీరును దిగమింగుతాం. తమ ఆకలిని తీర్చుకునేందుకు జంతువులు ఇలా ప్రవర్తిస్తుంటాయని మరోసారి బాధపడతాం.
కానీ కామం అనే ఆకలి కోసం పిల్లలు చచ్చిపోయేలా చిత్రహింసలకు గురి చేసే వారిని ఏమనాలి? జంతువుల కంటే హీనం అనాలా? లేక కర్కోటకులు, క్రూరులు, దుర్మార్గులు, కసాయిలు అనాలా? వివాహేతర సంబంధాలు మనిషిని ఏ స్థితికైనా తీసుకెళ్తుందనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి రాష్ట్రంలో జరిగిన రెండు తాజా ఘటనలు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Father Torture Kid in Jangareddigudem : ఏలూరు జిల్లా తాటిచర్లకు చెందిన శశికి ఇద్దరు పిల్లలు. ఉదయ్ రాహుల్(8) నాల్గో తరగతి చదువుతుండగా, కుమార్తె రేణుక ఒకటో తరగతి అభ్యసిస్తోంది. భర్త గణేశ్‌తో విభేదాల కారణంగా శశి గత కొంత కాలంగా వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో జంగారెడ్డిగూడంలో టిఫిన్ సెంటర్ నడిపిస్తోన్న పవన్ అనే వ్యక్తితో ఏడాదికాలంగా సహజీవనం చేస్తోంది. అయితే, తమ సహజీవనానికి పిల్లలు అడ్డుగా వస్తున్నారని భావించిన పవన్ గత నెలలుగా చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. శనివారం కూడా ఈ క్రమంలోనే పిల్లలపై మరోసారి తన దాష్టికాన్ని చూపించాడు. సెల్‌ఫోన్ చార్జర్‌తో విచక్షణ రహితంగా చావాబాదాడు. దెబ్బలకు తాళలేక రాహూల్ ఏడుస్తూ బయటకు పరిగెత్తి వచ్చాడు. వంటి నిండా తీవ్ర గాయాలు, కొట్టిన దెబ్బలకు పళ్లు ఊడిపోయి ఏడుస్తున్న ఆ బాలుడిని చూసి స్థానికులు చలించిపోయారు. వెంటనే స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి ఆ బాలుడిని తీసుకెళ్లారు.
ఆ చిన్నారి ఒంటిపై ఉన్న దెబ్బలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. తన చెల్లిపైనా కూడా దాడి చేస్తున్నట్లు బాలుడు కన్నీటిపర్యంతం అయ్యాడు. రాహుల్ చెల్లి రేణుకను సైతం స్థానికులు ఆస్పత్రికి తీసుకురాగా ఆమె శరీరంపైనా కాలినగాట్లు, వాతలను వైద్యులు గుర్తించారు. పవన్ దాష్టికానికి తల్లి కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
Woman Tortured Daughter in Palnadu : మరో ఘటనలో కన్నతల్లే కుమార్తెకు నరకం చూపించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నివాసముంటున్న మాధవి భర్త నాలుగు సంవత్సరాల కిందట మరణించాడు. ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది. శివపార్వతి అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటోంది. మాధవి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఆమెకు శివపార్వతి సహకరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆ బంధానికి బిడ్డ అడ్డుగా ఉందని భావించిన మాధవితో పాటు శివపార్వతి ఆ బాలికను చిత్రహింసలకు గురిచేశారు.
గత ఐదు రోజులుగా ఆ బాలికకు అన్నం పెట్టలేదు. ఆకలేస్తుందని అడిగితే అట్లకాడతో వాతలు పెట్టారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆ చిన్నారి చెత్త కుప్ప దగ్గర ఆహారం ఏరుకుంటుండగా చూసిన స్థానికుడొకరు శనివారం 1098కి ఫిర్యాదు చేశారు. వెంటనే ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రమీల, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ ఆ పాప ఇంటికి వెళ్లారు. వీరి రాకను చూసిన శివపార్వతి వారి పైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పింది.
మాధవికి వివాహం కాలేదని, ఆమెకు కూతురు ఎక్కడిదని బుకాయించింది. తర్వాత వారిద్దరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడంతో దుస్తులు పెట్టే ర్యాక్‌లో పాపను దాచిపెట్టానని శివపార్వతి చెప్పింది. పోలీసులు వెళ్లి ఆ చిన్నారిని కాపాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలిక శరీరంపై ఉన్న వాతలు, దెబ్బలు చూసిన పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది విస్మయానికి లోనయ్యారు. అమ్మాయిని నరసరావుపేటలోని శిశుగృహకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
"వీడు అసలు మనిషేనా?" - తల్లితో అలా, కుమార్తెతో ఇలా!
Inhuman incident: అయ్యో చిట్టి తల్లీ.. ఇంట్లో మూత్రం చేసిందని తల్లి ఏం చేసిందంటే..!