Some Politicians Ugadi Wishes to All Telugu People:తెలుగువారందరికి పలువురు ప్రముఖులు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని కొత్త ఆశలను చిగురింపజేస్తుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అభిలషించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నందున అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందామని చంద్రబాబు తెలిపారు. ఈ పండుగ ప్రజలకు ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధిని అందించాలని ఆయన కోరుకున్నారు.
ఈ జీవితం షడ్రుచుల సంగమం అని మనకు గుర్తు చేసే తెలుగువారి పండుగ ఉగాది అని హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తీపి, చేదు కలిస్తేనే జీవితమని ఆయన పేర్కొన్నారు. తెలుగు వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఆనందోత్సాహాలను పంచేందుకు వచ్చేదే ఈ ఉగాది పండుగని బాలకృష్ణ అన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికి కూడా బాలకృష్ణ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని యువత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు జరగాలని నందమూరి బాలకృష్ణ కోరుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.