Three People Died in Accident in Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కూతురిని తీసుకొని వెళ్లడానికి వచ్చిన ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. 25 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులో జరిగింది.
వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రమేశ్‌కు సంగారెడ్డి జిల్లా అందోలుకు చెందిన మమతతో వివాహం నిశ్చయమైంది.. ఈనెల 28న వివాహం ఉండడంతో బుధవారం వధువుని తీసుకొని రావడానికి పాచారం నుంచి పెళ్లి కుమారుడికి సంబంధించిన బంధువులు ఓ ట్రాక్టర్లో బయల్దేరారు.
Road Accident in Andole Mandal : అందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులోని మలుపు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భూదమ్మ (52), సంగమ్మ (46), అక్కడికక్కడే మృతి చెందగా ఆశమ్మ చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలు కాగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనాల్లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేపు పెళ్లి కార్యక్రమం జరగనుండగా బంధువుల రాక, హడావిడితో సందడిగా ఉన్న ఇంటిలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.