Two Police Died in Telangana : తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇది వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్ మోసంలో రూ. 25 లక్షలు నష్టపోయిన ఓ హెడ్ కానిస్టేబుల్, భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి తానూ తాగాడు. అయినా మరణించకపోవడంతో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాపిల్లలను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. మరో ఘటనలో వివాహేతర సంబంధమన్న నిందారోపణతో ఓ హెచ్‌సీ స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రూ.25 లక్షలు పోగొట్టుకుని :రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34) అదే జిల్లాలోని టీజీఎస్‌పీ 17వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్య మానస, 11 సంవత్సరాల్లోపు ఇద్దరు కుమారులు యశ్వంత్, ఆశ్రిత్‌లతో కలిసి సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆయన ఆందోళనగా కనిపించగా భార్య ఆరా తీసింది. 15 రోజుల కిందట అధిక లాభాల ఆశతో బాలకృష్ణ అప్పులు చేసి మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని ఓ కంపెనీలో విడతలవారీగా రూ. 25 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు.
ఆ తర్వాత కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాలకృష్ణ ఆందోళనకు లోనయ్యాడు. ఇక అప్పులు తీర్చే మార్గం లేదని, అందరం కలిసి చనిపోదామని భార్యను ఒప్పించాడు. శనివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి పిల్లలకు తాగించి వారూ తాగారు. అందరూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పృహలోకి వచ్చిన బాలకృష్ణ భార్యాపిల్లలు ప్రాణాలతో ఉండడాన్ని గమనించాడు. మరో గదిలోకి వెళ్లిన ఆయన గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.
కొద్దిసేపటికి మెలకువ వచ్చిన భార్య సమీపంలోని బంధువులకు ఫోన్ చేసింది. వారొచ్చి అందరినీ సిద్దిపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ అప్పటికే మరణించగా మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మానస ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని జరిగిన మోసంపై దర్యాప్తు చేస్తామని వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు పేర్కొన్నారు.