TTD has Taken Action on Illegal Sale of Laddus :తిరుమల అంటేనే కలియుగ వైకుంఠనాథుని తర్వాత అందరికి గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూల కోసం భక్తులు పరుగులు తీస్తుంటారు. అంతేకాదు ఎన్ని లడ్డూలు దొరికితే అన్ని తీసుకుని వచ్చి బంధువులు, స్నేహితులకు ప్రసాదంగా పంచిపెడతాం. అయితే లడ్డూలకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంతమంది దళారులు తిరుమలలో కొన్న లడ్డూలను బయట అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పలువురు మోసాలకు గురవుతున్నారు. దీనిపై టీటీడీ దృష్టి సారించింది. లడ్డూ ప్రసాదాల విక్రయాలపై చర్యలు చేపట్టింది.
సప్తగిరి అతిథి గృహంలో టీటీడీ ఈవో తనిఖీలు- అధికారులకు మెమోలు - TTD EO Syamala Rao Inspection
అక్రమ లడ్డూ విక్రయాలపై ప్రత్యేక చర్యలు : దర్శనం టికెట్ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి ఇకపై గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదాలు పక్కదారి పట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. దర్శనం టికెట్ లేనివారు ఆధార్ కార్డు చూపి రెండు లడ్డూలు కొనుగోలు చేయవచ్చని స్పష్టంచేశారు. సామాన్య భక్తులకు మేలు చేకూర్చడంతోపాటు దళారులను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భక్తుల ముసుగులో కొందరు లడ్డూప్రసాదాలను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ప్రసాదం పాలసీలో మార్పులు చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.