TTD Grandly Organized Chakrasnanam Tirumala on Occasion of Vaikunta Dwadashi:వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో చక్రస్నానం కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. వేకువజామున ఆలయం నుంచి తిరువీధుల్లో చక్రతాళ్వారును పల్లకిలో ఊరేగింపుగా వరాహపుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పాలు, పెరుగు, కొబ్బరినీరు తదితర సుగంద ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్లకు వేదమంత్రోచ్చరణల, మంగళవాయిద్యాల మధ్య అర్చకులు పుష్కరస్నానం చేయించారు. చక్రస్నానం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రత్యేక పూజలు, కైంకర్యాల అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు వైకుంఠద్వారాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం శ్రీవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. సర్వాంగసుందరంగా అలంకరించిన స్వర్ణరథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేశారు.
టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు సామాన్య మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వర్ణరథాన్ని లాగారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు స్వర్ణరథంపై కొలువుదీరిన స్వామిని దర్శించుకున్నారు. స్వర్ణ రథోత్సవంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి, తితిదే బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్ల, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.