Problems of Incomplete Bridges in NTR District:ఎన్టీఆర్ జిల్లాలో శిథిలావస్థ, అసంపూర్తి వంతెనలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. వీటిని పూర్తి చేయాలని, మరిన్ని కొత్త వంతెనలను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నప్పటికీ ఫలవంతం కావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సమస్యను పూర్తిగా గాలికొదిలేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
శిధిలావస్థ వంతెనలతో ఇబ్బందులు:ఎన్టీఆర్ జిల్లాలో పలు వాగులు, వంకలు వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. వీటిపై ఎప్పుడో నిర్మించిన వంతెనలు కొన్ని శిథిలావస్థకు చేరుకోగా, మరికొన్ని ప్రారంభ దశలోనే ఎదురు చూస్తున్నాయి. నిధులు కొరత మూలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని కీలక మార్గాల్లో శిథిల వంతెనలు ప్రజలకు పరీక్షలు పెడుతున్నాయి. జి.కొండూరు మండలం ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై వంతెన 2022లో పూర్తిగా ధ్వంసమైంది. కొత్తగా వంతెన నిర్మాణానికి 10.5 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపగా ఆమోదం రాలేదు. ఈ మార్గం మీదుగా జి. కొండూరుకు 8 గ్రామాల ప్రజలు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ గుణదల ఒకటో డివిజన్లో ఉలవచారు కంపెనీ నుంచి కార్ల్ మార్క్స్ రోడ్డు వరకు పైవంతెన నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
ఏళ్ల తరబడి అవస్థలు:2009లో మంజూరైన ఈ పైవంతెన పదిహేనేళ్ల పాటు నత్తనడకన నడిచింది. అయితే ఇప్పుడు పైవంతెన నిర్మాణానికి భూసేకరణ ఓ కొలిక్కి వచ్చింది. నూరు శాతం రైల్వే నిధులతో నిర్మాణానికి రైల్వేకు ప్రతిపాదించగా అంగీకరించారు. అయితే డివిజన్లో విద్యుత్తు లైన్లు, డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించాలి. వీటిని సొంత ఖర్చుతో తొలగించేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. 21 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపగా పాలన అడ్డంకులు తొలగాయి. విజయవాడ రైల్వే జీఎం నుంచి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ అనుమతులు రాగానే త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై కొత్త వంతెనను ఏర్పాటు చేయాలని తమ మొరను ప్రభుత్వం ఆలకించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మైలవరం మండలం పుల్లూరు శివారు కొత్తగూడెం నుంచి చిలుకూరివారిగూడెం, సీతారాంపురం తండాలకు వెళ్లే దారిలో బుడమేరు పైవంతెన 2022లో కోతకు గురై కుంగింది. నాటి నుంచి తాత్కాలిక మరమ్మతులూ లేక ద్విచక్ర వాహనాల ప్రయాణాలకే పరిమితమైంది. ఎప్పటికప్పుడు 25 లక్షలతో అధికారులు అంచనాలు వేయడమే తప్ప ఆమోదం లేక నేటికీ పెద్ద వాహనాలను పుల్లూరు మీదుగా మళ్లించి గ్రామానికి చేరుతున్నారు. ఇక్కడ లోలెవెల్ వంతెన రైలింగ్ శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. మైలవరం మండలం చండ్రగూడెం వద్ద 50 ఏళ్ల నాటి వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. నిరుడు భారీ వరదలకు ఓ పిల్లర్ కుంగింది.