Tourist killed in Drunken Brawl in Goa : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వారి జీవితాల్లో విషాదం నింపింది. సరదాగా గడుపుదామని వెళ్లిన టూర్ ప్రాణాలు తీసింది. కన్న వారికి కడుపుకోత మిగిల్చింది. నూతన సంవత్సర వేడుకలకు గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బంధువులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆరో వార్డుకు చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు ఏడుగురు స్నేహితులతో కలిసి గత శనివారం హైదరాబాద్ నుంచి గోవా వెళ్లారు. సోమవారం రాత్రి కలంగుట్ బీచ్‌లో వీరంతా సరదాగా గడిపి పక్కనే ఉన్న మరీనా బీచ్‌షాక్ అనే రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లారు.
బిల్లులో ధరలు అధికంగా ఉన్నాయని వీరితో పాటు వచ్చిన ఓ యువతి నిర్వాహకుడిని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెస్టారెంట్ యజమాని కుమారుడు సుబెట్ సిల్వేరా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఘర్షణ జరిగింది. రెస్టారెంట్‌లో పనిచేసే కొందరు రవితేజపై కర్రలతో దాడి చేశారు.