Tomato Price Fall in Telangana :టమాట ధరలు పతనమవుతున్నాయి. పది రోజుల కింద రూ.50 ఉన్న కిలో టమాట ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్‌లో కిలో టమాట రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇటీవల ఈ స్థాయిలో టమాట ధరలు ఎప్పుడూ పడిపోలేదు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంట మార్కెట్‌కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు.
కిలో టమాట ధర :కొన్ని రోజుల కింద కిలో టమాట రూ.80 నుంచి రూ.100లతో బెంబేలెత్తించాయి. పది రోజుల కింద వరకు రూ.50 పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. నాణ్యమైన టమాట 25 కిలోల ట్రేను రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో కిలో ధర రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. 3 కిలోల టమాట రూ.20 చొప్పున అమ్ముతున్నారు. కనీసం రూ.20 ఉంటే తప్ప పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు.
అన్నదాత ఆవేదన :సమీప గ్రామాల నుంచి రైతు బజార్‌కు రావాలంటే ఆటో ఖర్చు ఒక్కో ట్రేకు రూ.50, హమాలీ ఛార్జి రూ.10 మొత్తం 60 ఖర్చవుతోంది. సరకు విక్రయించగా వచ్చిన డబ్బులు కూలీ, రవాణా, హమాలీ ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు స్థానికంగా పండించిన పంట ఎక్కువ మొత్తంలో మార్కెట్‌కు వస్తుండటంతో ధరలు పడిపోతున్నాయి.