Tollywood Actress Suryakantham 100th Birth Anniversary :తన నటనా వైభవంతో వెండి తెరపై సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన నటి సూర్యకాంతం. పాత్ర ఏదైనా ఆమె పరకాయ ప్రవేశం చేస్తుంది. అంతటి మహానటి పుట్టింది, నటనలో ఓనమాలు నేర్చుకున్నది తూర్పు తీరంలోనే( కాకినాడలోనే).
సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబరు 28న (28-10-1924) జన్మించారు. సూర్యకాంతం ఆరేళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. కాకినాడలోని అక్క శేషమ్మ దగ్గర ఆమె పెరిగారు. అప్పుటి నుంచే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. సినిమాలు చూడటమన్నా, డిటెక్టివ్ నవలలు చదవడమన్నా ఆమెకు ఎంతో ఇష్టం.
గయ్యాళి అత్త సూర్యకాంతంనే భయపెట్టిన 'ఆమె'- అప్పట్లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన తెలుసా?
పురుషులతో సైకిల్ పోటీల్లో గెలిచి :కాకినాడలో జరిగిన ఒక సైకిల్ రేసులో సూర్యకాంతం పురుషులతో పోటీ పడి విజేతగా నిలిచారు. యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రదర్శించిన సతీ సక్కుబాయి, తులాభారం, చింతామణి వంటి నాటకాల్లో సూర్యకాంతం పురుష పాత్రలు పోషించారు.
అలా నటనవైపు :సినిమా వాల్ పోస్టర్లను చూస్తూ నటనపై ఇష్టం పెంచుకున్నారు సూర్యకాంతం. సురభి నాటక సమాజం కాకినాడలో వేసిన నాటకాలు చూసి ఆకర్షితురాలు అయ్యారు. కాకినాడలోని ది యంగ్మెన్స్ హ్యాపీక్లబ్‌లో (The Youngmen's Happyclub) చేరి నాటకాలు వేయడం ప్రారంభించారు. రిహార్సల్‌కు వీకే రాయపురం నుంచి సైకిల్, రిక్షాలో వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే అంజలి, ఎస్వీ రంగారావు వంటి వారితో పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే సినీ ప్రపంచంలో అడుగు పెట్టారు. కాకినాడలోని మెక్లారిన్ పాఠశాలలో విద్య అభ్యాసం చేశారు. ఇయ్యూని అప్పల ఆచార్య వద్ద వీణ, గాత్ర సంగీతంలో శిక్షణ పొందారు.