Tirupati Vaikunta Dwaram Tickets 2025 :తిరుమల కొండపై ఘనంగా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. జనవరి 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఈనెల 19వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవుల్లో పెద్ద ఎత్తున భక్తులు కొండపైకి తరలి వస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు మంజూరు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీకి సంబంధించిన టోకెన్లను భక్తులకు అధికారులు బుధవారం జారీ చేస్తున్నారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చే కేంద్రాలు :
శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తులకు టోకెన్లు మంజూరు చేస్తున్నారు. వీటితో పాటు భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కేంద్రాలుగా అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్థానికుల కోసం ప్రత్యేకంగా తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టికెట్లు అందజేస్తున్నారు. ఇక జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు ఏరోజూకారోజున ఒక రోజు ముందస్తుగా టోకెన్లను టీటీడీ అధికారులు అందిస్తున్నారు.