ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెస్టారెంట్లలో ఫుడ్ లొట్టలేసుకుంటూ తింటున్నారా? - ఇలా చేయండి - TIPS FOR EATING OUT AT RESTAURANTS

రెస్టారెంట్స్​కు వెళ్లే ముందు ఈ సూచనలు పాటించాలంటున్న నిపుణులు

Healthy tips for Eating at Restaurants
Healthy tips for Eating at Restaurants (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 8:07 PM IST

Healthy tips for Eating at Restaurants :ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్‌, డిన్నర్లు అంటూ రెస్టారెంట్​లకు వెళ్తుంటాం. కొన్ని సార్లు ప్రత్యేక సందర్భాలే కాదు పిల్లలు వెళ్లాలని పట్టుబట్టినా వెళ్లక తప్పదు. ఇక రెస్టారెంట్​కు​ వెళ్లామంటే నచ్చిన ఫుడ్​ను ఆర్డర్​ చేసి రుచిని ఎంజాయ్​ చేయాల్సిందే. అయితే ఈ రోజుల్లో పలు పేరున్న హోటల్స్, రెస్టారెంట్లలో కూడా ఆహారం కల్తీ జరుగుతోందన్న వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. ఇలాంటి ఆహారం ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. అయితే తప్పనిసరిగా రెస్టారెంట్లు, హోటల్స్​కు వెళ్లినప్పుడు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకుంటే సమస్యే ఉండదంటున్నారు. ఇందుకోసం కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

'లేడీస్​.. ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లొద్దు'.. ప్రభుత్వం షాకింగ్​ నిర్ణయం

  • రెస్టారెంట్లో అడుగుపెట్టగానే మనం చేసే మొదటి పని మెనూ చూడడం. ఈ క్రమంలోనే వాటి టేస్ట్​ ఎలా ఉంటుందో తెలియకపోయినా పేర్లు డిఫరెంట్​గా ఉండటంతో తినాలనే కోరిక కలిగి ఆర్డర్‌ చేస్తుంటాం. అయితే ఇలాంటి వాటిలో చాలా వరకు కొవ్వులు, నూనె పదార్థాలు ఎక్కువగా ఉన్నవే ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కావున తెలిసి తెలిసి పొరపాటు చేయకుండా ఆ మెనూలోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే మసాలా, కొవ్వులు వంటివి ఎక్కువగా వాడిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు.
  • ఎలాగో రెస్టారెంట్​కు వెళ్తున్నాం కదా అని చాలా మంది ఇంట్లో ఏమీ తినకుండా ఉంటారు. రెస్టారెంట్​కు వెళ్లిన తర్వాత నచ్చిన ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో లాగించచ్చన్నది వారి భావన. అయితే ఇది ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. బయట లంచ్‌కి, డిన్నర్‌కి వెళ్లే ముందు ఇంట్లోనే ఓ కప్పు పెరుగు, కొన్ని డ్రైఫ్రూట్స్‌ వంటి ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాల్ని తీసుకుంటే రెస్టారెంట్లో మితంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.
  • కొంతమంది రెస్టారెంట్లో భోజనంతో పాటు కూల్​డ్రింక్స్​ ఆర్డర్‌ చేస్తుంటారు. నిజానికి దీనివల్ల చక్కెరలు, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. అందుకే వీటికి బదులుగా నీళ్లు తాగమంటున్నారు నిపుణులు. బరువు అదుపులో పెట్టుకోవాలనుకునే వారు భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే శరీరంలోని అదనపు క్యాలరీలు కరుగుతాయని, బరువూ తగ్గే అవకాశం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని నిపుణులు చెబుతున్నారు.
  • మనం ఫుడ్‌ మెనూను పరిశీలిస్తే ఆయా వంటకాల ముందు స్టీమ్‌డ్‌, గ్రిల్డ్‌, రోస్టెడ్‌, ఫ్రైడ్ ఇలా రకారకాలుగా రాసుంటుంది. దీని ద్వారా ఆయా పదార్థాల్ని ఎలా తయారుచేశారో అర్థమవుతుంది. అయితే వీటిలో స్టీమ్‌డ్‌, గ్రిల్డ్ వంటి పద్ధతుల్లో తయారైన వంటకాలు ఎంపిక చేసుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే అందులో క్యాలరీలు, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. అదే ఫ్రైడ్‌, క్రంచీ వంటి పదార్థాల్లో క్యాలరీలు, కొవ్వులూ ఎక్కువే! కాబట్టి ఆయా వంటకాల్ని ఎంచుకునే ముందు దాన్నెలా తయారుచేశారో అక్కడి వాళ్లను అడిగి తెలుసుకోవడంలోనూ తప్పు లేదంటున్నారు.
  • చాలా మంది ఫుడ్‌ ఆర్డర్‌ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితమవుతుంటారు. ఒక్కోసారి ఇది కూడా అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి పదార్థాల్ని ఆర్డర్‌ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితం కాకుండా మీ అవసరాల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
  • పిజ్జా, బర్గర్స్‌ వంటివి ఆర్డర్‌ చేసినప్పుడు చాలా మంది ఎక్ట్స్రా చీజ్‌తో టాపింగ్‌ చేయించుకుంటారు. దీనికి బదులుగా ఉడికించిన కాయగూర ముక్కల్ని ఎంచుకోవడం ఆరోగ్యకరమంటున్నారు. అలాగే కొవ్వులు, ఉప్పు వంటివి ఎక్కువగా ఉండే సాస్‌లకు దూరంగా ఉండడం మరీ మంచిదని చెబుతున్నారు నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details